శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:31

సినారె విశ్వకవి

సినారె విశ్వకవి

  • ‘విశ్వంభర’తో ప్రపంచ గుర్తింపు: మంత్రి నిరంజన్‌రెడ్డి 

తెలుగు యూనివర్సిటీ: విశ్వంభర కావ్యంలో విశ్వజనీన విలువలను పొందుపరచి డాక్టర్‌ సీ నారాయణరెడ్డి విశ్వకవిగా మారారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆబిడ్స్‌ తిలక్‌రోడ్డులో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్తులో జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సినారె 89వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మంత్రి.. సినారె కీర్తి తెలుగు సాహిత్యంలో  అజరామరంగా నిలుస్తుందని అన్నారు. సాహిత్యంలో కవిరాజుగా, నిజజీవితంలో రారాజుగా వెలుగొందారని కొనియాడారు. వచ్చే జయంతి నాటికి వనపర్తిలో సినారె కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతామని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనతరం కవులతోనే గాక తరువాత తరం కవులతోనూ పోటీపడి సినారె కవిత్వం రాశారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గాను ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యకు డాక్టర్‌ సీ నారాయణరెడ్డి సాహితీపురస్కారాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రదానం చేశారు. సినారె సినీ గీత సర్వస్వం ఆరవ సంపుటిని కూడా మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo