ఆదివారం 31 మే 2020
Telangana - May 04, 2020 , 15:58:34

వలస కార్మికులకు మంత్రి సత్యవతి వీడ్కోలు

వలస కార్మికులకు మంత్రి సత్యవతి వీడ్కోలు

మహబూబాబాద్‌: వలస కూలీల విషయంలో కేంద్రం ఒక రోడ్‌ మ్యాప్‌ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. తొలిసారి లాక్‌డౌన్‌ను అమలు చేసినప్పుడే వలస కూలీలను ఎక్కడివాళ్లను అక్కడకు తరలిస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము ఇక్కడ పనిచేసుకుంటామన్న వారిని ఇక్కడే ఉంచి వెళ్తామన్న వారిని పంపిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రైవేటు బస్సులు పెట్టి వారిని గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. జిల్లా నుంచి ఇతర రాష్ర్టాలకు బయలుదేరిన పలువురు వలస కార్మికులకు ఆమె వీడ్కోలు పలికారు.  

మండలాల వారీగా వలస కార్మికులను గుర్తించడానికి నోడల్‌ ఆఫీసర్లను నియమించామని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైస్‌ మిల్లర్లు రైతులకు నష్టం వచ్చేలా చేయొద్దని మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. పంటలో కోత ఎక్కువగా పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, కరోనాను అవకాశంగా తీసుకుని రైతులకు అన్యాయం చేయొద్దని హెచ్చరించారు. తాలు పేరుతో మిల్లర్లు రైతులను నష్టపర్చకుండా చూడాలని మహబూబాద్‌ కలెక్టర్‌ను, ఇతర అధికారులను మంత్రి ఆదేశించారు.  


logo