బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 20:31:56

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

హైద‌రాబాద్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర గిరిజనశాఖ‌ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. బుధ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిసిన మంత్రి స‌త్య‌వ‌తి ప‌లు అంశాల‌పై ప‌రిష్కారాలు కోరుతూ విజ్ఞాప‌న ప‌త్రాలు అంద‌జేశారు. కేంద్రం సానుకూలంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఈ మేర‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదేవిధంగా ఇల్లందు, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో దాదాపు లక్ష ఎకరాలకు నీరందించే విధంగా సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ పై అదనపు లిఫ్ట్ మంజూరు చేయాలని కోరారు. 

ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి నది పరివాహక గ్రామాల్లో  ప్రవాహం వల్ల జరిగే వరదలు, భూమి కోతను నివారించేందుకు ఫ్లడ్ బ్యాంక్స్ పనులు పూర్తి స్థాయిలో చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. గార్ల-రాంపూర్ రోడ్డు కమ్ బ్రిడ్జి ఆ ప్రాంతాల రవాణాకు అత్యంత ముఖ్యమైన రహదారి. ప్రతిసారి వర్షాకాలంలో ఈ రోడ్డు ముంపునకు గురి కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్నేరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాల్సిందిగా విన్న‌వించారు. 

స్థానికుల డిమాండ్ నేప‌థ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు.  ఇనుగుర్తిలో మండలానికి కావల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, లైబ్రరీ, బ్యాంకు, వెటర్నరీ హాస్పిటల్ వసతులున్నందున మండలంగా ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు.  ఇచ్చిన హామీ మేర‌కు మహబూబాబాద్ జిల్లాకు వైద్య క‌ళాశాల మంజూరు చేయాల్సిందిగా కోరారు. మహబూబాబాద్ లో మోడర్న్ మార్కెట్ డిమాండ్ కూడా చాలాకాలంగా ఉందని, దీనిని కూడా సానుకూలంగా పరిశీలించి మంజూరు చేయాలని సీఎంను కోరారు. 


logo