మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 13:06:45

గ్రేట‌ర్ పీఠం మ‌రోసారి టీఆర్ఎస్‌దే : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

గ్రేట‌ర్ పీఠం మ‌రోసారి టీఆర్ఎస్‌దే : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

హైద‌రాబాద్‌:  జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కానగర్ డివిజన్ లో ఇవాళ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ధర్మపురి కాలనీ లోని సాయి బాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గత ఎన్నికల్లోనూ చిలుకా నగర్ లో ప్రచారం నిర్వహించి ఇక్కడ అభ్యర్థి భారీ గెలుపు తో విజయం సాధించేలా కృషి చేశానని, ఈసారి కూడా చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిందని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ధి చేశారని, శాంతిభద్రతలు అద్భుతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. యువ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చేశారని చెప్పారు.

రైల్వేస్టేషన్లో చాయి అమ్ముకొని ప్రధానమంత్రిని అయ్యానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ గారు నేడు అదే రైల్వే వ్యవస్థను దానితోపాటు ఎల్ఐసి వంటి మరో 23 పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వ సంస్థల వ్యతిరేక పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అదేవిధంగా ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కనీస ప్రజాదరణకు నోచుకోక చతికిల పడిందని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు హైదరాబాదులో మతకల్లోలాలు, నిత్యం కర్ఫ్యూ వుండేవని, గత ఏడేళ్ల కెసిఆర్ పాలనలో కర్ఫ్యూ, మతకల్లోలాలు లేని మతసామరస్య నగరంగా, శాంతిభద్రతలు అద్భుతంగా కొనసాగుతున్న నగరంగా మారిందని, దీనిని ప్రజలు గుర్తించి ఈ మతసామరస్యాన్ని, శాంతిభద్రతలను కొనసాగించేందుకు మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ముఖ్యంగా చిలక నగర్ డివిజన్లో పేదలు, ధనికులు, మేధావులు అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని, గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇక్కడ ప్రచారం చేసినప్పుడు భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత ఐదేళ్లు అందుబాటులో ఉంటూ, చిల్కానగర్ అభివృద్ధి చేశామన్నారు. ఈసారి నేను మంత్రిగా ఉండడం, నా ఇల్లు ఇక్కడే ఉండటం వల్ల చిలకనగర్ మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి పని చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు.హైదరాబాద్ అభివృద్ధి ఇంకా వేగంగా జరిగేందుకు ప్రోత్సహించేలా మరోసారి టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.