బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 19:58:09

త‌ర‌గ‌తుల ప్రారంభం నాటికి స‌ర్వం సిద్ధం చేయాలి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

త‌ర‌గ‌తుల ప్రారంభం నాటికి స‌ర్వం సిద్ధం చేయాలి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

హైద‌రాబాద్ : గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో వచ్చే నెల తరగతుల ప్రారంభం నాటికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  ఫిబ్రవరి నుంచి 9వ తరగతి, ఆపై తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంస్థలలో విద్యార్థులకు కల్పించాల్సిన వసతులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి గిరిజన సంక్షేమశాఖ అధికారులతో మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైన‌ర్ రిపేర్ల కోసం ప్రతి పాఠశాల, కాలేజీకి రూ. 20 వేలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 

విద్యార్థులు తరగతులకు హాజరయ్యే నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫామ్స్ కుట్టించి సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే క్లాత్ సిద్ధంగా ఉన్నందున, కుట్టుడు కోసం స్థానికులకు ఆర్డర్లు ఇవ్వాలన్నారు. కుట్టుడు కోసం ధరలు కూడా 100 రూపాయలు పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వచ్చిన తర్వాత భోజన వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా ఉండే విధంగా ముందే నిత్యావసర వస్తువుల పంపిణీ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు శానిటైజర్, రెండు మాస్కులు, కాస్మెటిక్స్ సబ్బులు, షాంపులు, నూనెలు, పౌడర్లతో కూడిన జీసీసీ కిట్‌ను అందించాలన్నారు. 

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 202 ఆశ్రమ పాఠశాలలు, 118 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 113 రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, 163 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 22 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయని, వీటిలో 86435 మంది విద్యార్థులు విద్య‌న‌భ్య‌సిస్తున్న‌ట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గురుకులాల ఉప కార్యదర్శి నవీన్ నికోలస్ ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.


logo