శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 12:53:03

ప‌ల్లెలు బాగుంటేనే ప్ర‌జ‌లు బాగుంటారు : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

ప‌ల్లెలు బాగుంటేనే ప్ర‌జ‌లు బాగుంటారు : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

హైద‌రాబాద్ : ఉపాధి హామీ పథకాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో అమలు చేయడం వల్ల గ్రామాలు బాగు పడుతున్నాయి. ప‌ల్లెలు బాగుంటేనే ప్ర‌జ‌లు బాగుంటారు అని గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ స్ప‌ష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీ రాజ్ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్లు, డి సిల్టింగ్, స్మశాన వాటికలు, హరితహారం, ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత, కాలువల్లో చెత్త తొలగింపు వెడల్పు చేయడం, ఉపాధి కల్పన వంటి వివిధ పనులపై పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో రాష్ట్ర 5వ ఉపాధి హామీ పథకం కౌన్సిల్  సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి,  సత్యవతి రాథోడ్, మల్లారెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ..  స్వచ్ఛ భారత్‌ (గ్రామీణ్‌)లో రాష్ర్టాన్ని వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిపిన పంచాయతీ రాజ్‌శాఖను అభినందిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ చొర‌వ‌తోనే తండాలు గ్రామ పంచాయ‌తీలుగా మారాయ‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ నుంచి గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు రావాల్సిన నిధులు స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేయ‌డంతో గిరిజ‌నుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. గిరిజన సంక్షేమ శాఖకు రావాల్సిన‌ వాటాను ఇయర్ మార్క్ చేయాలని కోరుతున్న‌ట్లు స‌త్య‌వ‌తి రాథోడ్‌ పేర్కొన్నారు.