శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 01:06:29

వర్క్‌షీట్లు 3 భాషల్లో

వర్క్‌షీట్లు 3 భాషల్లో

  • దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలు
  • డిజిటల్‌ బోధన ప్రాక్టీస్‌కు వినియోగం
  • తొలి రెండువారాలు పూర్వ తరగతుల పాఠాలు
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మంత్రి సబిత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీనుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చే నెల 1వ తేదీనుంచి విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పాఠాల ప్రాక్టీస్‌ కోసం మూడు భాషల్లో వర్క్‌షీట్లు రూపొందించారు. వర్క్‌షీట్లు తయారుచేయడంలో రాష్ట్రం దేశంలో ముందంజలో ఉన్న ది. ఉపాధ్యాయులంతా విధులకు హాజరవుతున్నా రు. డిజిటల్‌ బోధన నేపథ్యంలో అందుకు అవసరమైన కంటెంట్‌ కోసం ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో రెగ్యులర్‌ తరగతులు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఆన్‌లైన్‌ పాఠాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ విద్యాశాఖను ఆదేశించారు. దీంతో జూనియర్‌, డిగ్రీ, పీజీ కాలేజీలతోపాటు ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యా కాలేజీలలో కూ డా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వివరాలు మంత్రి మాటల్లోనే..

కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ

విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల అడ్మిషన్లపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. గ్రామాలవారీగా విద్యార్థులను గుర్తించి, వారికి వెంటనే అడ్మిషన్లు ఖరారుచేస్తున్నాం. డిజిటల్‌ బోధన తర్వాత విద్యార్థులకు పాఠాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో తెలుసుకోవడానికి ఎస్సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో రూపొందించిన వర్క్‌షీట్లను ఎప్పటికప్పుడు అందచేస్తాం. దేశంలోనే తొలిసారిగా తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో వర్క్‌షీట్లను రూపొందించాం. వాటిని ఎస్సీఈఆర్టీ వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్‌చేశాం. వీటిని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మూడోవారం నుంచి కొత్త పాఠాలు

ఒకటో తేదీనుంచి డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ తొలి రెండువారాలు మాత్రం పూర్వ తరగతుల పాఠాలు బోధించాలని నిర్ణయించాం. మూడో వారంనుంచి మాత్రమే కొత్త పాఠాలు బోధిస్తాం. ఈలోగా ఉపాధ్యాయులు డిజిటల్‌ బోధనకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధంచేస్తారు. ఒక వేళ విద్యార్థులు ఏ కారణం వల్లనైనా డిజిటల్‌ తరగతులు వినకపోయినప్పటికీ, గత పాఠాలు వినడానికి టీసాట్‌ యాప్‌ ద్వారా వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. htts://scert.telangana.gov.inలో వర్క్‌షీట్లు, డిజిటల్‌ తరగతులు కూడా అందుబాటులో ఉంచుతాం. విద్యార్థులకు దూరదర్శన్‌/టీసాట్‌ ఏదీ అందుబాటులో ఉందో లేదో తెలుసుకొనే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాం. రాష్ట్రంలో 26.37 లక్షల మంది విద్యార్థులకు 1.51 కోట్ల పాఠ్యపుస్తకాల ఉచిత పంపిణీ ప్రక్రియను పూర్తిచేశాం. ప్రైవేటు పాఠశాలల 32.51 లక్షల మంది విద్యార్థులకు మార్కెట్‌లో 1.28 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాం.


logo