శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 20:29:14

‘పేదల ఆత్మగౌర‌వ లోగిళ్లు.. డ‌బుల్ బెడ్రూం ఇండ్లు’

‘పేదల ఆత్మగౌర‌వ లోగిళ్లు.. డ‌బుల్ బెడ్రూం ఇండ్లు’

ఖమ్మం : పేదల ఆత్మగౌర‌వ లోగిళ్లు.. డ‌బుల్ బెడ్రూం ఇండ్లు అని, అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం వీవీపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ‌త ప్రభుత్వాలు పేదలకు త‌క్కువ వ్యయంతో అర‌కొర వ‌స‌తుల‌తో ఇండ్లను నిర్మించి ఇచ్చిందని.. కానీ తెలంగాణ‌ ప్రభుత్వం వారి ఆత్మగౌరవం నిలిపేలా డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మించి ఇస్తున్నాదని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప‌క్షపాతి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ ప‌థ‌కాలు దేవానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.  భూవివాదాలను పరిష్కరించేందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తెచ్చింద‌న్నారు. ప్రజ‌ల ఆస్తుల‌, భూముల ర‌క్షణ‌కు కొత్త రెవెన్యూ చ‌ట్టంలో మరింత ప‌ని చేస్తుంద‌న్నారు. ధరణి ద్వారా అత్యంత పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు రూ. 46 వేల 123 కోట్ల అంచనాతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. 23 వేల 787 ఆవాసాలకు రక్షిత తాగునీరు అందిస్తున్నామని, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే రూ. 230 కోట్లతో ఇంటింటికి తాగు నీరు అందించబోతున్నామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ భగీరథ వినూత్న పథకమని ప్రశంసిస్తూ హడ్కో 3 సార్లు అవార్డు అందించిందని గుర్తుచేశారు. అంతకుముందు 6వ డివిజన్లో రూ.65 లక్షలతో సీసీరోడ్లుకు శంకుస్థాపన చేసి  నూతనంగా నిర్మించిన మోడరన్ పబ్లిక్ టాయిలెట్లను మంత్రి ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వారి వెంట మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ ఆర్‌వీకర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.