శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 17:38:23

ఆయిల్ ఫామ్ రైతులకు ఉజ్వల భవిష్యత్తు : మ‌ంత్రి పువ్వాడ

ఆయిల్ ఫామ్ రైతులకు ఉజ్వల భవిష్యత్తు : మ‌ంత్రి పువ్వాడ

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : ఆయిల్ ఫామ్ రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉంద‌ని, సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంద‌ని ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ద‌మ్మ‌పేట మండ‌లంలోని అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్ట‌రీని మంత్రి సంద‌ర్శించారు. ఫ్యాక్ట‌రీ ప్ర‌గ‌తి, ఆయిల్ ఫెడ్ రైతుల‌కు అందిస్తున్న సేవ‌ల‌పై మంత్రి ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ రైతుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి పువ్వాడ ప్ర‌సంగించారు. 

దేశంలోని 130 కోట్ల జ‌నాభాకు ప్ర‌తి ఏడాది 21 ల‌క్ష‌ల కోట్ల మెట్రిక్ ట‌న్నుల వంట నూనె అవ‌స‌రం ప‌డుతుంద‌ని మంత్రి తెలిపారు. కానీ కేవ‌లం ఏడు ల‌క్ష‌ల కోట్ల‌ మెట్రిక్ ట‌న్నుల వంట‌నూనెను మాత్ర‌మే ఉత్పత్తి చేయ‌గ‌లుగుతున్నాం. మిగ‌తా 15 ల‌క్ష‌లకోట్ల‌ మెట్రిక్ ట‌న్నుల నూనెకు రూ. ల‌క్ష‌ల కోట్లు చెల్లించి.. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నామ‌ని తెలిపారు. 

ఈ క్ర‌మంలో దేశీయ డిమాండ్ మేర‌కు ఇక్క‌డి రైతులే ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి సారించాల‌ని మంత్రి సూచించారు. ఈ సాగుకు ప్ర‌భుత్వం రాయితీలు కూడా క‌ల్పిస్తుంద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ర్టంలో 40 వేల 872 ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది. రానున్న ఐదేళ్ల‌లో 5 నుంచి 10 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తుంద‌ని మంత్రి చెప్పారు. 

అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. పామాయిల్ సాగు రైతులకు పూర్తి ఆర్థిక భరోసా ఇస్తుందని చెప్పారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఆయిల్ఫెడ్ కొనుగోలు చేసి రవాణా ఖర్చు తో సహా వారం రోజుల్లోనే చెల్లింపులను పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 234 మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన 6. 25 లక్షల ఎకరాల భూములను గుర్తించామని మొదటి విడతలో లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

విదేశాల నుండి నూనె దిగుమతులు పూర్తిగా తగ్గించే విధంగా దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగు చేసుకునేలా రైతులు ఆసక్తి పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టి ఎస్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఇ ఎన్ డి నిర్మల, జిల్లా ఉద్యాన అధికారి మరియన్న తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు


MOST READ
logo