సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 19:30:22

మిషన్ భగీరథ పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ అసంతృప్తి

మిషన్ భగీరథ పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ అసంతృప్తి

ఖమ్మం : ఇంటింటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. తొలుత నగరంలోని ఇందిరా నగర్ బైపాస్ రోడ్, ఎన్ ఎస్పీ కాలువ వద్ద(ఖానపురం), చర్చ్ కాంపౌండ్ రోడ్, జెడ్పీ సెంటర్లో  కొనసాగుతున్న పనులను పరిశీలించారు.

ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం ప్రతిష్ఠత్మికంగా తీసుకున్న కార్యక్రమంలో అలసత్వం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగం పెంచాలని వారిని అదేశించారు. అనంతరం టీటీడీసీలో నిర్వహించిన రివ్యూలో మంత్రి మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనులు పట్ల అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ ట్యాంక్(OHRS) పనుల వివరాలు ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నుండి ఏ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుందనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


ఎన్ని ట్యాంక్‌లకు కలెక్షన్లు ఇచ్చారని, ట్యాంక్‌ల నిర్మాణం ఇంకా పూర్తి చేయకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. నగరంలో అంతర్గత పైప్‌లైన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు రావడం వాటిని పరిష్కరిస్తున్నామని అధికారులు విన్నవించారు. ఇంటింటికి నల్లా ఇచ్చే క్రమంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన పథకంలో అధికారులు అలసత్వం ప్రదర్శించటం ఏంటని ప్రశ్నించారు. పైప్‌లైన్ల పనులను ఎందుకు ముందుకు సాగట్లేదని, పనులను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.

అధికారులు సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాడుకలోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎల్ అండ్ టీ వైస్ చైర్మన్ సతీష్, ఈ ఎన్సీ ధనరాజ్, ఎల్ అండ్ టీ మేనేజర్ హరి ప్రసాద్, ఎస్ఈ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ కుమార్, మిషన్ భగీరథ అధికారులు ఉన్నారు.


logo