ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 13:19:32

వారు అభివృద్ధి నమూనా గిట్టని మరుగుజ్జులు: మంత్రి పువ్వాడ

వారు అభివృద్ధి నమూనా గిట్టని మరుగుజ్జులు: మంత్రి పువ్వాడ

ఖమ్మం: అభివృద్ధి నమూనా గిట్టని కొందరు మరుగుజ్జులు కృతిమ ఉద్యమం చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పర్యాటకులు వచ్చి వెళ్తుంటారని విమర్శించారు. మొన్న బీజేపీ నేతలు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం ఎన్‌ఎస్సీ క్యాంపులో సమీకృత మార్కెట్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నూతన బస్టాండ్‌, ఐటీహబ్‌, పార్కులు, కూడళ్ల నిర్మాణంతో ఖమ్మం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వెల్లడించారు. ఖమ్మం సమీకృత మార్కెట్‌కు రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చిందని చెప్పారు. టేకులపల్లిలో వెయ్యి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించామని, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా వచ్చే నెలలో ప్రారంభించుకుందా మని చెప్పారు.  

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అమలవుతున్నాయని చెప్పారు. భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించడం తో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమీకృత వ్యవసాయ మార్కెట్ వల్ల ప్రజలకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పారు. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కూరగాయలు విక్రయించేందుకు అనుకూలంగా ఉన్నాయని, అవి స్థానికంగా పండించిన రైతులు మాత్రమే విక్రయించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 

బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని పక్క రాష్ట్రానికి అప్పనంగా అప్పగించారని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బీజేపీ నేతల వద్ద సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 

రైతులు తల ఎత్తుకుని జీవించాలని సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సమీకృత మార్కెట్‌లో రైతుల పంటకు మంచి ధర వస్తుందని చెప్పారు. ఎన్నికల కోసం ఎంతో మంది వచ్చి ఆరోపణలు చేస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.