శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 13:25:36

డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం రవాణా కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా సిమ్యులేటర్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.  అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కొవిడ్ తరుణంలో అనేక మార్పులు, చేర్పుల అనంతరం కొన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. వినియోగదారుడు కార్యాలయానికి రాకుండానే అనేక సేవలు ఇప్పటికే ఆన్ లైన్  చేశామన్నారు. ఇటీవలే జులై 24వ తేదీన మరో 5 సేవలు ఆన్ లైన్ పొందుపరిచామని, ఇది వినియోగదారుడికి ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్ రవాణా కార్యాలయంలో ఉండే ప్రతి సౌకర్యాన్ని విస్తరించాలని తలచి నేడు సిమ్యులేటర్  ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్లు, భారీ వాహనాలు నేర్చుకోదలచిన వారు మొదట  సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందేనని అన్నారు.  రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్‌ ద్వారా డ్రైవింగ్‌ మెళకువలను తెలుసుకోడం తప్పనిసరి అని,  ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్‌ శిక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు.


లెర్నింగ్‌ లైసెన్సు పరీక్షలకు హాజరయ్యే  అభ్యర్థులను సిమ్యులేటర్‌  శిక్షణకు ప్రోత్సహించేందుకు  ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సిమ్యులేటర్‌ మాదిరిగానే తొలిసారిగా ఖమ్మంలో ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్‌ స్కూల్లో సిమ్యులేటర్‌ శిక్షణ తప్పనిసరి చేయనుమని పేర్కొన్నారు.  తద్వారా ప్రాథమిక దశలోనే  వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపైన  అవగాహన ఏర్పడుతుందన్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్‌ లో మెళకువలను నేర్పించడం వల్ల  రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. 
logo