శనివారం 06 జూన్ 2020
Telangana - May 03, 2020 , 18:31:18

కడ్తా పేరుతో తరుగు తీస్తే చర్యలు తప్పవు

కడ్తా పేరుతో తరుగు తీస్తే చర్యలు తప్పవు

నిజామాబాద్:  ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. గత యాసంగి లో ఈ సమయానికి ఎంతైతే ధాన్యం కొనుగోలు చేశామో, ఈ కరోనా కష్ట సమయంలో కూడా అదే వేగంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అంతే మేర ధాన్యం సేకరించామని మంత్రి గుర్తు చేశారు.  రోజుకు 20వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, 20 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మిగిలిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని  ఆదేశించారు. ఆదివారం జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ పై ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సమీక్షించారు. 

జిల్లాలో మొత్తం 339 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2.19 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామని, 1.94 లక్షల మెట్రిక్‌టన్నుల (96శాతం) ధాన్యాన్ని రైస్‌మిల్లలకు తరలించామన్నారు. ఆర్మూర్‌లో 90శాతం, బోధన్‌లో 97శాతం, బాన్సువాడలో 99శాతం, రూరల్‌లో 88శాతం , బాల్కొండలో 85శాతం మేర ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంలో రైస్‌మిల్లలకు తరలించామన్నారు. హమాలీల కొరత ఉన్నందున దీన్ని నివారించేందుకు ఈ మధ్య నిబంధనల సడలింపులకు ఇతర రాష్ట్రాల నుంచి హమాలీలను తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు నాణ్యతతో (ఎఫ్‌ఏక్యూ) కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చినప్పటికీ రైస్‌మిల్లర్లు కడ్తా తీయడం క్షమించరాని నేరమని, అలా జరిగితే మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. 

ధాన్యాన్ని 16 గంటలలోగా రైస్‌మిల్లర్లు అన్‌లోడ్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. కడ్తా పేరుతో దోపిడి జరగకుండా వ్యవసాయ విస్తర్ణాధికారులు (ఏఈవోలు) సమన్వయం చేసుకోవాలని, ధాన్యం నాణ్యత పరిశీలించి, రైతుల పక్షం వహించి, రైస్‌మిల్లర్లతో మాట్లాడి సజావుగా సేకరణ ప్రక్రియ జరిగేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏఈవోలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయాధికారి నిరంతరం దీని పై పర్యవేక్షించాలని ఆదేశించారు.  ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దని సూచించారు. అవకతవకల పై ఇప్పటి వరకు చేపట్టిన కఠినచర్యలు కొనసాగించాలని, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.  ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇప్పటికే రూ. 142 కోట్లను మద్దతు ధర కింద రైతులకు చెల్లించిందని, ఇందులో చిల్లిగవ్వ కూడా కేంద్రం వాటా లేదన్నారు. 

పొద్దు తిరుగుడు పంటకు కేంద్రం మద్దతు ధర ఉన్న 25శాతమే కొనుగోలు చేస్తామని అనడంతో రైతులు ఆందోళన చెందారని, సీఎం కేసీఆర్ మిగిలిన పంటంతా కొనుగోలు చేయాలని కోరడంతో రైతులకు ఎంతో భరోసా దొరికిందని, క్వింటాల్‌కు రూ. 2వేలు అదనంగా లబ్ధి చేకూరిందని అన్నారు. శనగ పంట సైతం కేంద్రం 25శాతమే కొనుగోలు చేస్తామని చేతులెత్తేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మిగిలిన 75శాతం శనగను సైతం రాష్ట్రమే కొనుగోలు చేసిందని, తెల్లజొన్నల పంటను ఒక్క గింజ కూడా కేంద్రం కొనుగోలు చేయలేదని, వందశాతం పంటను రాష్ట్రమే కొని రైతులను ఆదుకున్నదని గుర్తు చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా టార్ఫాలిన్ కవర్లను సరఫరా చేయాలని ఆదేశించారు. 

ఎలాంటి రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దని, ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని అధికారులకు తెలిపారు. రైతులతో బలవంతంగా హామీ పత్రం రాయించుకుంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం నాణ్యత పై సూత్రీకరించే బాధ్యత ఏఈవోలకే ఉందని, ఇదొక్కటే కడ్తా దోపిడీకి పరిష్కారామని మంత్రి అన్నారు. ఎవరు రాజకీయాలు చేస్తున్నారో, ఎవరు రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారో రైతాంగం గమనిస్తున్నదని, ఎవరి ఒత్తిళ్లలకు భయపడొద్దని, సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగుతున్న నేతల తీరు రైతులకు అర్థమైందని మంత్రి అన్నారు. 

ధాన్యం సేకరణలో మనమే టాప్.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి..

వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా టాప్‌లో నిలవడం పట్ల జిల్లా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా రైతులకు అన్ని విధాలుగా  అండగా నిలబడి ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు కోసం పీఏసీఎస్ చైర్మన్లు ఎంతో శ్రమకోర్చి పనిచేస్తున్నారని, రైతుల కష్టాన్ని కొల్లగొట్టాలని చూసే వారికి కరోనా వస్తుందని ఆయన శపించారు. ఎంపీ అర్వింద్ దొంగచాటుగా అనవసర ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. 

తప్పుడు ప్రకటనలు ఇస్తూ గందరగోళాన్ని సృష్టించాలని చూస్తున్నాడని, కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని, రైతులకు అండగా నిలబడాలని సూచించారు. జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ.. మంత్రి ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ పై సమీక్ష నిర్వహిస్తూ రైతులకు అండగా నిలబడుతున్నారని, బీజేపీ నాయకులు రాజకీయాల కోసం అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బంగడుపుకుంటున్నారని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ధాన్యం సేకరణలో టాప్‌లో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. రూ. 25వేల కోట్లతో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చరిత్రాత్మకమన్నారు. ఆరుతడి పంటలను కొన్న ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదేనని అన్నారు. రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నామని అన్నారు.  ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ ఆలోచనలన్నీ రైతు సంక్షేమం కోసమేనని, రైతుబంధు, 24గంటల ఉచిత కరెంటు, రైతుబీమా, కాళేశ్వరం సాగునీరు, మద్దతు ధర ఇలా అన్ని రకాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్నదని, దేశానికే రాష్ట్రం అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు.

 నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ముందుందని గుర్తు చేశారు. ఎంపీ హోదాలో ఉండి అర్వింద్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రౌడీయిజం, బెదిరింపులకు భయపడే వారు ఎవరు లేరని హెచ్చరించారు. గత పాలకులు పట్టించుకోకుండా వదిలేసిన ఎర్రజొన్న పంటను కొని రూ. 13 కోట్లను రైతులకు చెల్లించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.  అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. ఇది రాజకీయ సమయం కాదని, అర్వింద్ హుందగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో జిల్లా టాప్‌లో ఉందని, ఎప్పటికప్పుడు మంత్రి సమీక్షలు నిర్వహిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ పకడ్బందీగా కొనసాగుతున్నదని ప్రశంసించారు. డీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ మాట్లాడుతూ.. కడ్తా దగ్గర రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ, డీసీసీబీ వైస్‌చైర్మన్ కే రమేశ్‌రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo