బుధవారం 20 జనవరి 2021
Telangana - Aug 05, 2020 , 03:35:20

పల్లీలో కొత్త వంగడాలు

పల్లీలో కొత్త వంగడాలు

  • ఐసీఏఆర్‌ సహకారంతో ఇక్రిశాట్‌ ఉత్పత్తి
  • గిరినార్‌- 4, గిరినార్‌- 5గా నామకరణం
  • వంగడాలపై మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతాంగానికి నాణ్యమైన, అధిగ దిగుబడి ఇచ్చే నూతన వేరుశనగ వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. గిరినార్‌-4, గిరినార్‌-5 అనే ఈ వంగడాలను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) సహకారంతో ఇక్రిశాట్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తిచేసినట్టు తెలిపారు. ఈ నూతన వంగడాలపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే యాసంగిలో ఈ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ రకాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పెద్దఎత్తున రైతాంగం ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ సహకారంతో విత్తనోత్పత్తి చేయించాలని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు మంత్రిని కోరారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇక్రిశాట్‌ ఆసియా రిసెర్చ్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ పూరన్‌ ఎం గౌర్‌, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఇక్రిశాట్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ జెనీలా, వ్యవసాయ వర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్త వంగడాల ప్రత్యేకత.

  • సాధారణ రకాల్లో ఓలిక్‌ యాసిడ్‌ 40%. ఈ వంగడాల్లో 80% 
  • దిగుబడి 30% అధికం. lనూనె కూడా 3% అధికం
  • 115 రోజుల్లోనే పంట చేతికొస్తుంది.
  • ఈ నూతన వంగడాలు ఆలివ్‌ ఆయిల్‌ ఉండే నాణ్యత కలిగినవి. 
  • సుదీర్ఘకాలం మన్నిక. ఆహారశుద్ధి పరిశ్రమలకు ఉపయుక్తం.
  • ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో యాసంగి సాగుకు అనుకూలం.


logo