గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 18:54:55

వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ. 50 కోట్లు ఇవ్వండి...

వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ. 50 కోట్లు ఇవ్వండి...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. సాగునీరు రావడంతో తెలంగాణ సాగు స్వరూపం మారిపోయింది. దేశంలోనే అత్యధికంగా వేరుశనగ దిగుబడి వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వస్తుంది. హెక్టారుకు ఈ ప్రాంతంలో 1611 కిలోల దిగుబడి వస్తుంది .. దేశ సరాసరి దిగుబడి 1486 కిలోలు మాత్రమే. నాణ్యమైన విత్తనాలతో పాటు, ఆప్లాటాక్సిన్ లేని వేరుశనగ  దిగుబడి ఈ ప్రాంతానికి సొంతం. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో రైతాంగానికి మరింత తెగుళ్లను తట్టుకుని నిలబడే నాణ్యమయిన విత్తనాలు అందించడంతో పాటు, ఎగుమతికి అవకాశముండే వేరుశనగ పండించడానికి వనపర్తిలో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.

ఆప్లాటాక్సిన్ లేని వేరుశనగకు విదేశాలలో మంచి డిమాండ్ ఉంది .. దీని నుండి ఉత్పత్తి చేసే పీనట్ బట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు, దానికి అవసరం అయిన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, ల్యాబ్ ను ఏర్పాటు చేయడం, నూతన భవనం కోసం కేంద్రం నుండి రూ.50 కోట్లు మంజూరు చేయండని లేఖలో విజ్ఞప్తి చేశారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని గుర్తించి కేటాయించడం జరిగింది. కేంద్రం సహకరించి నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రైతులకు ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఎంతో మేలు చేస్తుందని కోరారు. 


logo
>>>>>>