మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Feb 18, 2020 , 02:03:31

మద్దతుధరకు కందులు కొంటాం

మద్దతుధరకు కందులు కొంటాం
  • రైతులు ఆందోళన చెందవద్దు
  • సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచండి
  • దళారులకు సహకరిస్తే అధికారులు జైలుకే
  • వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కంది పంటను రాష్ట్రప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కంది రైతుల సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. కొనుగోలుకు అభయం ఇచ్చారని వెల్లడించారు. కంది కొనుగోళ్ల కోసం దాదాపు రూ.200 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ బండారు భాస్కర్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కంది కొనుగోలు కోటాను పెంచాలని లేఖరాసినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. 


కంది దిగుబడిపై వ్యవసాయశాఖ వద్ద సమగ్ర సమాచారం ఉన్నదని, దళారులు అక్రమంగా తెచ్చి అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారులకు సహకరించే అధికారులకు జైలు తప్పదని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజైన ఫిబ్రవరి 17ను రైతు పర్వదినంగా భావిస్తూ.. రాష్ట్రంలో రైతు లు సంబురాలు చేసుకుంటున్నారని మంత్రి చెప్పారు. దేశంచూపుమొత్తం తెలంగాణ రైతువైపు, తెలంగాణ వ్యవసాయం వైపు ఉన్నదని.. కేసీఆర్‌ చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయాల అమలే ఇందుకుకారణమన్నారు. కృష్ణా, గోదావరి జలాలను బీడుభూములకు మలిపి రైతాంగానికి సాగునీరు అందించారని చెప్పారు. 


కందిని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం మద్దతు కోరినట్టు తెలిపారు. రూ.5,800 క్వింటాల్‌ చొప్పున 47,500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు నాఫెడ్‌ అనుమతించిందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం ప్రగల్భాలు పలుకుతున్నదని ఎద్దేవాచేశారు. విదేశీ మారకద్రవ్యం పెంచుకునే పసుపుపంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని విమర్శించారు. రైతు సానుకూల నిర్ణయాలతో ముందుకువెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించడంలేదని మండిపడ్డారు. సహకార ఎన్నికల్లో స్ఫూర్తిదాయక తీర్పునిచ్చిన తెలంగాణ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు.