శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 15:40:12

వానా కాలంలో కంది, పత్తి పంటలు.. యాసంగిలోనే మొక్కజొన్న

వానా కాలంలో కంది, పత్తి పంటలు.. యాసంగిలోనే మొక్కజొన్న

హైదరాబాద్‌ : వానాకాలంలో కంది, పత్తి పంటలు ఎక్కువగా సాగు చేయాలని, యాసంగిలోనే మొక్కజొన్న సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి రైతులకు సూచించారు. నియంత్రిత పంటల సాగుపై హాకా భవన్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో మంత్రి నిరంజన్‌ రెడ్డి సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియంత్రిత పంటల సాగుపై ఈ నెల 21న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరగబోతుందని తెలిపారు. 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్కార్‌ చెప్పిన పంటలే సాగు చేస్తూ.. పంట వేయడం నుంచి మొదలుకొని అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగంపై దృష్టి సారించారని, అందుకే ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలని పట్టుబట్టి కార్యాచరణకు శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు.

రేపు ఉదయం 10 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమగ్ర వ్యవసాయ విధానంపై సమావేశం ఉంటుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశానికి రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు హాజరు కానున్నారు.


logo