ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 17:34:30

యాసంగి సాగుపై ప్ర‌ణాళిక సిద్ధం చేయండి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

యాసంగి సాగుపై ప్ర‌ణాళిక సిద్ధం చేయండి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ర్టంలో యాసంగి సాగుపై ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని వ్య‌వ‌సాయ అధికారుల‌ను ఆ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆదేశించారు. యాసంగి సాగుపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రి నిరంజ‌న్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్  నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. యాసంగి సాగు 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వ విన్న‌పాన్ని మ‌న్నించి వానాకాలంలో నియంత్రిత సాగుకు రైతులు మ‌ద్ద‌తు ప‌లికారు అని తెలిపారు. అయితే యాసంగిలో మ‌క్క‌జొన్న వేసేందుకు రైతుల‌కు అవ‌కాశం ఇద్దామ‌నుకున్నాం.. కానీ ఇప్ప‌టికే అధికంగా దేశ‌, అంత‌ర్జాతీయ నిల్వ‌ల మూలంగా మ‌ళ్లీ మ‌క్క సాగు చేస్తే రైతులు న‌ష్ట‌పోతారు. ఈ క్ర‌మంలో మ‌ద్ద‌తు ధ‌ర కూడా వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యాన్ని ఏఓ, ఏఈవోలు రైతుల‌కు తెలియ‌జేయాల‌ని మంత్రి సూచించారు.  

సాగు పెరిగే అవ‌కాశం 

మ‌క్క‌జొన్న‌కు ప్ర‌త్యామ్నాయ లేదా మార్కెట్ డిమాండ్ గ‌ల పంట‌ల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను నిరంజ‌న్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువులలో పుష్కలంగా నీరు ఉండ‌డంతో గ‌త యాసంగి క‌న్నా ఇప్పుడు పంట‌ల సాగు గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని అంచ‌నా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. కరోనా మూలంగా ప్రజలు పట్టణాలు విడిచి పల్లెలకు చేరారు. బీడు భూముల‌ను కూడా మంచిగా చేసుకుని వ్య‌వ‌సాయం చేస్తున్నారు.  

యూరియా స‌ర‌ఫ‌రాలో జాప్యం వ‌ద్దు

పెసర్లు, మినుములు, జొన్న, వేరుశనగ, పప్పుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు తదితర డిమాండ్, మద్దతుధర ఉన్న పంటలను ఏఏ ప్రాంతాలలో సాగుకు ప్రోత్సహించగలమో అధికారులు నివేదిక సిద్దం చేయాలి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆదేశించారు. యాసంగి సాగుకు కావాల్సిన‌ విత్తనాలను అందుబాటులో ఉంచాలి. యాసంగి సాగుకు తెలంగాణకు కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా,  ఇతర కాంప్లెక్సు ఎరువులతో కలిపి  మొత్తం 18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించింది. యూరియా సరఫరా విషయంలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాల‌న్నారు. యూరియా సరఫరాలో మెరుగ్గా వ్యవహరించని, ఎక్కడైనా అవకతవకలకు పాల్పడిన సెంటర్లు ఉంటే వాటిని గుర్తించి యాసంగిలో లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

ద‌స‌రా వ‌ర‌కు రైతు వేదిక‌లు పూర్తి కావాలి

రైతువేదికల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్న మంత్రి.. దసరా వరకు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. రైతు వేదిక‌ల నిర్మాణంలో అధికారుల ప‌నితీరును మంత్రి అభినందించారు. క్రాప్ బుకింగ్ కు సంబంధించిన వివరాలను తుదిరూపుకు తీసుకురావాలి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆదేశించారు. 


logo