మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 26, 2020 , 20:36:13

ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం...

ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం...

వనపర్తి:  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా వైరస్ పై తీసుకుంటున్న చర్యల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ ను నిరోధించగలమని మంత్రి  అన్నారు . ఎక్కడి వారు అక్కడే ఉండాలి . ఇల్లు వదలి బయటకు రావద్దు . బతుకుదెరువు నిమిత్తం నెలలకు నెలలు, సంవత్సరాలు దూరంగా ఉండే వాళ్ళం ఆపద వచ్చినప్పుడు మరో మూడు వారాల పాటు దూరం ఉండలేమా దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. లాక్  డౌన్ పీరియడ్లో వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలను పెంచి అమ్మ రాదు. ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.  అలాగే కూరగాయల ధరలను కూడా పెంచి అమ్మ వద్దు. అత్యవసర సమయంలో ఎవరైనా ఎక్కువ రేటుకు అమ్మి  ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావద్దు. నిర్దిష్ట, నియమిత ధరలకే నిత్యావసరాలు, కూరగాయలు అమ్మాలి. ఒకవేళ ఎవరైనా  ఎక్కువ ధరలకు అమ్మితే  వెంటనే వారిపై కేసు బుక్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

నిత్యావసర సరుకులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైనన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిత్యవసర సరుకులు, కూరగాయలు పొందటంలో కూడా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలి. కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. ప్రభుత్వ అధికారుల పనికి ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తాం. ముఖ్యంగా గ్రామాలలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందికి అవసరమైన మాస్కూలు ఇప్పించడంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు సహకరించాలి. అన్ని గ్రామాలలో ప్రస్తుతం చేస్తున్న పారిశుధ్య పనులకు అదనంగా నీటి వనరులను శుభ్రం చేయటం  చేపట్టాలి.  తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి జాబితా రూపొందించాలి. నిరంతరం పరిశుభ్రత కార్యక్రమాలతోపాటు బ్లీచింగ్ చల్లడాన్ని కొనసాగించాలి.

జిల్లాలోని అన్ని గ్రామాలలో పరిశుభ్రత పై మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ప్రతిరోజు 10 గ్రామాలను తిరిగి తాగునీరు, పారిశుధ్యం పై వివరాలు తెలుసుకొని నివేదిక అందించే బాధ్యత డిపివోది. అలాగే గ్రామాలలో చిన్నచిన్న విద్యుత్ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి  తీగలపల్లి, ఏదుల రిజర్వాయర్ల పనులు నిరంతరం కొనసాగేందుకు అక్కడి కూలీలకు నిత్యావసర సరుకులు అందేలా సమన్వయం చేసుకునే బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంటకోత,  విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఇబ్బందులు కలిగించవద్దు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇతర గ్రామాల్లో చిక్కుకున్నవారిని సొంత గ్రామాలకు చేరుకునే క్రమంలో పోలీసులు పూర్తి సహకారం అందించాలి. 

వారిని ఇబ్బంది పెట్టకుండా వారి సమస్యలను విని వారిని సొంత ఊర్లకు చేర్చి ఏర్పాట్లు చేయాలి. ఈ సీజన్ లో వనపర్తి మార్కెట్కుధాన్యం, మొక్కజొన్నలను తీసుకురావద్దని రైతులకు విజ్ఞప్తి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయా గ్రామాలలోనే ఏర్పాటు చేయాలి. దాదాపు ఎక్కువ కేంద్రాలను ఐకెపి సంఘాలకు అప్పగించాలి. ఏ గ్రామంలో  పండిన పంట ఆ గ్రామంలోనే కొనుగోలు చేయాలి. కరోనా కారణంగా మామిడి,బత్తాయి రైతులు విదేశాలకు పంపే అవకాశం లేనందున పెద్ద పెద్ద మాల్స్,సూపర్ మార్కెట్ లతో టై అప్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో వెంటనే బీదలకు బియ్యం పంపిణీ చేపట్టాలి. స్టాక్ పోయింట్ల నుండి చౌకధరల దుకాణాలకు  సరుకులను సరఫరా చేరవేసేందుకు హమాలీలకు పాసులు జారీ చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన మేరకు 1500 రూపాయలు ఇచ్చేందుకు జాబితాను రూపొందించాలి. ఆయా గ్రామాలు ఇతర గ్రామాల నుండి  ఎవరూ రాకుండా గ్రామం చుట్టుపక్కల కంచ వేయడం వల్ల ఆస్పత్రిల నిమిత్తం వెళ్లేవారికి, అత్యవసర పనులపై వెళ్లేవారికి, అదేవిధంగా నిత్యావసర సరుకులు గ్రామంలోకి రావాలన్నా పూర్తి ఇబ్బందులు తలెత్తుతున్నయి. అందువల్ల కంచలు కాకుండా కర్రల తో బారికేడింగ్ ఏర్పాటు చేసుకొని వైద్య సేవల నిమిత్తం, అత్యవసర నిమిత్తం, నిత్యావసర సరుకులు చేరవేసే వాహనాలకు ఆయా గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి.  వనపర్తి జిల్లా సమావేశం మధ్యలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి  కరోనా వైరస్ సందర్భంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి కోరారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులను ఈ నెల 31 వరకు పూర్తి చేయవలసి ఉందని, అయితే కరోనా నేపథ్యంలో మరో రెండు నెలలు గడువు పెంచాలని కోరగా అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. 


logo