శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 13:24:29

అధికారులు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌తో మెల‌గాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

అధికారులు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌తో మెల‌గాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

వ‌న‌ప‌ర్తి : ప‌్ర‌భుత్వ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌తో మెల‌గాల‌ని వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. వ‌న‌ప‌ర్తి మున్సిపాలిటీ ప‌రిధిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆదివారం ఉద‌యం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడాలి.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయొద్దు అని చెప్పారు. నిర్ల‌క్ష్యం వీడ‌కుంటే అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. వనపర్తి 8,9వ‌ వార్డులలో పనులు వెంటనే పూర్తికావాలి అని ఆదేశించారు. పీర్లగుట్టలో నెల‌కొన్న మంచినీటి, క‌రెంట్, డ్రైనేజి సమస్యలు మరోసారి త‌న‌ దృష్టికి రావొద్ద‌న్నారు. పీర్లగుట్ట స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. క‌రెంటు, నీళ్లులేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు చోద్యం చూడ‌డం స‌రికాద‌న్నారు. తాత్కాలికంగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల‌న్నారు. ప్రజలతో సమావేశమై డ్రైనేజీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి. గుట్ట ప్రాంతం అయినందున వలయాకారంలో డ్రైనేజీ రూపొందించి కిందకు లింకు కలపాలి అని సూచించారు. ప్రజలు సమస్యలు అడిగితే మొహం చాటేస్తే నాయకులు ఎలా అవుతారు? అని ప్ర‌శ్నించారు. ఒకటికి నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆదేశించారు.