ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:45:56

రుణ లక్ష్యం 1.61లక్షల కోట్లు

రుణ లక్ష్యం 1.61లక్షల కోట్లు

 • 10.52% అధికంగా ఎస్సెల్బీసీ రుణప్రణాళిక 
 • వ్యవసాయానికి రూ.75,141 కోట్ల రుణం
 • రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రణాళిక
 • విడుదల చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో వివిధరంగాలకు ఇచ్చే రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్సెల్బీసీ) ఖరారు చేసింది. ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి రూ.1,61,620 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది గతేడాది రూ.1,46,238.44 కంటే 10.52% అధికం. ఈ ఏడాది రుణ ప్రణాళికలో ప్రాధాన్యరంగాలకు రూ.1,22,720 కోట్లు (75. 93%) కేటాయించినట్టు ఎస్సెల్బీసీ తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ ఏడాది రుణప్రణాళికను విడుదలచేశారు. 

ఈ ఏడాది వ్యవసాయరంగానికి రూ.75,141.71 కోట్ల ను కేటాయించింది. గతేడాదితో (రూ.68, 596.71 కోట్లు) పోల్చితే ఈ ఏడాది 9.54% పెంచినట్లు ఎస్సెల్బీసీ పేర్కొన్నది. ఇందులో స్వల్పకాలిక పంట రుణాల కోసం రూ.53,222.51 కోట్లు కేటాయించగా.. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధరంగాలకు దీర్ఘకాలిక రుణాల కోసం రూ.12,061 కోట్లు, వ్యవసాయరంగ మౌలిక వసతుల కోసం రూ.2,422.37 కోట్లు, వ్యవసాయ సహాయ కార్యకలాపాల కోసం రూ.7,435.76 కోట్లు కేటాయించింది. గత ఆర్థికసంవత్సరంలో యాసంగి, వానకాలం సీజన్లకుగాను స్వల్పకాలిక పంట రుణాల కింద రూ.37,109 కోట్లు ఇచ్చినట్టు ఎస్సెల్బీసీ పేర్కొన్నది. ఇది మొత్తం టార్గెట్‌లో 76.13% పూర్తయినట్టని ప్రకటించింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధరంగాలకు రూ.1,4850 కోట్ల రుణాలు అందినట్టు తెలిపింది. 

ఎంఎస్‌ఎంఈలకు రూ.35.19 కోట్లు

2020-21 రుణ ప్రణాళికలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.35,196.87 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోల్చితే ఇది 12.25% అధికం. ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద ఇప్పటికే రూ.2513 కోట్లు మంజూరు చేయడంతోపాటు ఇందులో రూ.1,688 కోట్లను పరిశ్రమలకు విడుదల చేసినట్టు ఎస్సెల్బీసీ తెలిపింది. కరోనా పరిస్థితుల్లో అర్హులైన రైతులకు రూ.231 కోట్లు, స్వయం సహాయక బృందాలకు రూ.370 కోట్ల రుణాలు ఇచ్చినట్టు తెలిపింది. గృహ నిర్మాణ రంగానికి రూ.8,048.75 కోట్లు, విద్యా రుణాలకు రూ.2,165.73 కోట్లు, ఇతర రంగాలకు రూ.2,167.55 కోట్లు కేటాయించినట్టు ఎస్సెల్బీసీ పేర్కొన్నది.

డెయిరీ, ఫిషరీష్‌కూ రుణాలు

డెయిరీ ఉత్పత్తులు, చేపల పెంపకం చేసే రైతులకు కూడా ఇకపై సాధారణ రుణాలు ఇవ్వాలని ఎస్సెల్బీసీ సమావేశంలో నిర్ణయించారు. క్రాప్‌లోన్‌ మాదిరిగా రుణాలు అందనున్నాయి. క్రాప్‌లోన్‌ కింద కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రాయితీ వీరికి కూడా వర్తించనున్నది. ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.1.60 లక్షల వరకు, విజయ, ఇతర డెయిరీ సంస్థలతో అగ్రిమెంట్‌ ఉంటే గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణం అందనున్నది. ఇప్పటికే పశుసంవర్థకశాఖ క్షేత్రస్థాయిలో రుణాల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నది. ఇందులో 2.50 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ఎస్బీఐతోపాటు ఇతర బ్యాంకులు ఈ నెల 1వ తేదీ నుంచి ‘పీఎం స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి’ని ప్రారంభించినట్టు ప్రకటించింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందేలా అక్కడ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసినట్టు, ఐదువేలకు పైగా జనాభాగల గ్రామాల్లో 255 బ్యాంకు శాఖలను ప్రారంభించినట్టు తెలిపింది. సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్బీఐ జనరల్‌ మేనేజర్‌ శంకర్‌ సుందరం, ఎస్బీఐ సీజీఎం ప్రకాశ్‌మిశ్రా, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, స్పెషల్‌ సెక్రటరీ రోనాల్డ్‌ రాస్‌, నాబార్డ్‌ సీజీఎం వై కృష్ణారావు, ఎస్బీఐ జనరల్‌ మేనేజర్‌, ఎస్సెల్బీసీ కన్వీనర్‌ క్రిషన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. 

గతేడాది రుణ ప్రణాళికలో ముఖ్యాంశాలు

 • గతేడాది రూ.977 కోట్ల విద్యా రుణాలను, రూ. 5099 కోట్ల గృహరుణాలను అందించారు. 
 • ప్రాధాన్యరంగాలకు ఇచ్చిన రుణం రూ.1,11,036 కోట్లు. లక్ష్యంలో 99.77% పూర్తి. 
 • ఎంఎస్‌ఎంఈలకు రూ.49,848 కోట్లు. 158% టార్గెట్‌ పూర్తి. 
 • మార్చి 31 వరకు మొత్తం బ్యాంకు డిపాజిట్లు రూ.4,84,440 కోట్లు. రూ.30168 కోట్లు (6.64%) అధికం. 
 • క్రెడిట్‌ డిపాజిట్‌ నిష్పత్తి 117.52% నుంచి 117.75 శాతానికి పెరిగింది. 
 • మైనార్టీ క్యాటగిరీ విభాగంలో 1,74,915 మందికి రూ.2,668 కోట్లు, వీకర్‌ సెక్షన్స్‌ క్యాటగిరీలో 26,73,616 మందికి రూ.21,860 కోట్లు, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలో రూ.5071 కోట్లు రుణాలు ఇచ్చింది.  
 • ప్రధానమంత్రి ముద్ర యోజన కింద అన్ని బ్యాంకులు కలిపి రూ.9,128 కోట్ల రుణాలు ఇచ్చాయి. టార్గెట్‌ రూ.6,960 కోట్లు మాత్రమే. 
 • ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద 96.52 లక్షల బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు ఎస్సెల్బీసీ పేర్కొన్నది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 75.37 లక్షల కస్టమర్లు ఉన్నట్టు తెలిపింది.


logo