ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:03:37

ఎవుసం ముచ్చటకు రైతు వేదిక

ఎవుసం ముచ్చటకు రైతు వేదిక

 • రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలు 
 • 2,046 చదరపు అడుగుల్లో సకల సౌకర్యాలతో నిర్మాణం 
 • సీఎం కేసీఆర్‌ నేరుగా రైతులతో మాట్లాడేలా ఏర్పాట్లు
 • నిర్మాణానికి భూమి లేదా నిధులిస్తే వేదికకు వారిపేరు 
 • ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి నిర్మించనున్న ప్రభుత్వం
 • 2,046 చదరపు అడుగుల్లో సకల సౌకర్యాల కల్పన
 • వేదికల నిర్మాణానికి సీఎం సహా 70 మంది ముందుకు
 • సమావేశాలు, చర్చలతోపాటు గోదాంగా వినియోగం

నలుగురు చుట్టాలు కలిస్తే మంచీచెడు మాట్లాడుకుంటాం. ఒకరి అనుభవాల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకొని తప్పటడుగు వేయకుండా జాగ్రత్త తీసుకుంటాం. భూమాతనే నమ్ముకున్న రైతులంతా చుట్టాలే. విత్తు నాటినప్పటి నుంచి పంటచేతికొచ్చే వరకు కష్టాలతో సహవాసం చేసే రైతులకు మంచీచెడు చెప్పుకొనేందుకూ ఒక వేదిక కావాలి. అన్నదాతలను ఆత్మబంధువులుగా భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో 2,604 రైతు వేదికలు నిర్మిస్తున్నది. సమావేశాలు, చర్చలతోపాటు గోదాంగా వినియోగించుకొనేలా రూపకల్పన చేసింది. సహజంగానే రైతయిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌లోని మారుమూల పల్లెల్లోని రైతులతో వీడియోకాన్ఫరెన్సులో ముచ్చటించేందుకు వీలుగా అధునాతన సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయరంగాన్ని, రైతులను పట్టించుకొనే నాథుడేలేడు. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయం కుదేలై.. రైతులు అప్పులపాలయ్యారు. పోరాడి సాధించుకున్న తెలగాణలో సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయి. వ్యవసాయరంగంలోని సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరిస్తూ వస్తున సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు రైతులను సంఘటితం చేయడంపై దృష్టి సారించారు. రైతులందరినీ ఒకేచోటకు చేర్చి సాగుపై చర్చించుకొనే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేసేందుకు 5 వేల ఎకరాలకు కలిపి ఒక క్లస్టర్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయం విస్తరణాధికారి (ఏఈవో)ని నియమించింది. రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకొనేలా ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్‌ నిర్మాణానికి రూ.22 లక్షల అవసరమని అంచనావేశారు. మొత్తం రైతు వేదికల నిర్మాణానికి రూ.573 కోట్లు అవసరం. ఇప్పటికే ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేయగా, కొంతమేర నిధులను ఉపాధి హామీ కింద సమకూర్చాలని నిర్ణయించింది.


ఒక సమావేశ మందిరం.. రెండు గదులు

రైతులు సమావేశాలు నిర్వహించుకొనేందుకు, ఇతర అవసరాలకు అనుగుణంగా 2,046 చదరపు అడుగుల్లో ఒక్కో రైతు వేదికను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. రైతులు, అధికారులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ ఇలా 154 మంది కూర్చొని చర్చించుకొనేందుకు 1,498 చదరపు అడుగుల విస్తీర్ణంతో హాలు, అధికారుల కోసం ప్రత్యేకంగా రెండు గదులను నిర్మించనున్నారు. వీటితో పాటే మూత్రశాలను నిర్మించాలని నిర్ణయించారు. రైతు వేదికలకు నీటి అవసరం తీర్చేందుకు మిషన్‌భగీరథ ద్వారా నల్లా కనెక్షన్‌ ఇవ్వనున్నారు. రైతు వేదికల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కోసం ప్రతి రైతు వేదికకు టీ ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ నేరుగా ఏ రైతుతోనైనా మాట్లాడే వెసులుబాటు కలుగనున్నది.రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా ఉంటుంది.

సమావేశాలతోపాటు గోదాంగా..

రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా అన్నదాతలకు అన్నివిధాలుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. అధికారులతో సమావేశంతోపాటు వీటిని అవసరమైతే గోదాంలుగా కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ క్లస్టర్‌కు సంబంధించిన ఎరువులు, విత్తనాలు, పరికరాలు వచ్చినప్పుడు వాటిని తాత్కాలికంగా భద్రపరిచేందుకు వీటిని ఉపయోగించుకోనున్నారు. సమస్యల్లో ఉన్న రైతులు వ్యక్తిగత పంటలను భద్రపరిచేందుకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు.

నియంత్రిత సాగుకు ఎంతో ఉపయోగం

రైతులు డిమాండ్‌ ఉన్నటువంటి పంటలనే పండించేలా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలుచేస్తున్నది. ఈ విధానంలో రైతులను సంఘటితం చేయడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో నియంత్రితసాగు విధానంలో రైతు వేదికలు ముఖ్యపాత్ర పోషించనున్నాయి. రైతులను ఒకచోటికి చేర్చి ఏ పంటలు వేయాలి.. ఎరువుల వాడకం, ఇతర అంశాలపై వారికి అవగాహన కల్పించవచ్చు. తద్వారా ప్రభుత్వం సంకల్పించిన నియంత్రిత సాగు విధానం మరింత విజయవంతం అవుతుంది.

భూమిచ్చినా, పైసలిచ్చినా వేదికకు వారిపేరు

రైతు వేదికల నిర్మాణంలో ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రైతు వేదికల నిర్మాణానికి అవసరమయ్యే భూమి లేదా నిధులు సమకూర్చితే ఆ వేదికకు వారు సూచించిన పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు భారీ స్పందన వస్తున్నది. ఇప్పటివరకు సుమారు 40 మందివరకు భూమి ఇవ్వగా, మరో 30 మంది వేదిక నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ మర్కూక్‌, ఎర్రవల్లిలో తన సొంత ఖర్చుతో రైతు వేదికలు నిర్మిస్తానని ప్రకటించారు. అదేబాటలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా సొంత ఖర్చులతో రైతు వేదికల నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తంచేశారు.

దసరానాటికి అందుబాటులోకి..

రైతు వేదికలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పదిపదిహేను చోట్లలో మినహా మిగిలిన అన్ని క్లస్టర్లలో భూసేకరణ పూర్తయ్యింది. సుమారు 90 క్లస్టర్లలో భూమి పూజ కూడా చేశారు. మొత్తంగా వీటి నిర్మాణం త్వరగా పూర్తిచేసి దసరాకు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించారు.

రైతు వేదికలు ఇలా..

 1. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదిక
 2. రాష్ట్రవ్యాప్తంగా 2,604 రైతు వేదికలు
 3. పది, పదిహేను మినహా అన్నిచోట్లా స్థలసేకరణ పూర్తి 
 4. ఒక్కొక్కటి 2,046 చదరపు అడుగుల్లో నిర్మాణం
 5. 154 మంది కూర్చొనేలా 1,498 చదరపు అడుగుల్లో హాలు
 6. అధికారుల కోసం రెండు ప్రత్యేక గదులు, ఒక మూత్రశాల
 7. ఒక్కో వేదిక నిర్మాణ ఖర్చు అంచనా రూ.22 లక్షలు
 8. మొత్తం వేదికల నిర్మాణ ఖర్చు రూ.573 కోట్లు
 9. ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల
 10. కొంత మేర ఉపాధి హామీ నిధులు సమకూర్చాలని నిర్ణయం
 11. సుమారు 90క్లస్టర్లలో భూమి పూజ పూర్తి
 12. మొత్తంగా దసరాకు ప్రారంభించేలా ప్రణాళికలు


logo