శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 14:33:15

కేంద్రం నుంచి 4.64 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా రావాలి

కేంద్రం నుంచి 4.64 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా రావాలి

హైద‌రాబాద్ : రాష్ర్టానికి అవ‌స‌ర‌మైన ఎరువుల‌ను అంచ‌నా వేసి కేంద్రంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా మాట్లాడార‌ని రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. యూరియా స‌ర‌ఫ‌రాపై ఢిల్లీలో రెండుసార్లు కేంద్ర‌మంత్రిని క‌లిసి విజ్ఞ‌ప్తి చేశాన‌ని గుర్తు చేశారు. యూరియా స‌ర‌ఫ‌రాలో మాత్ర‌మే ఇబ్బందులు ఉన్నాయి.. ఇత‌ర ఎరువుల విష‌యంలో ఎలాంటి స‌మ‌స్య లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. 2020-21 వానాకాలానికి తెలంగాణ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు 10.50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా, 11.80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఇత‌ర ఎరువుల‌తో క‌లిపి మొత్తం 22.30 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నులు కేటాయించింది. కేంద్రం ఇంకా 4.64 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా ఇవ్వాల్సి ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు కేంద్రం 8.69 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఎరువులు కేటాయించ‌గా, ఆగ‌స్టు 31 నాటికి వాస్త‌వంగా 6.15 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఎరువులు స‌ర‌ఫ‌రా చేసింది.

2.54 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బ‌కాయితో ఆగ‌స్టు నెల ముగిసింది. సెప్టెంబ‌ర్ నెల‌లో కేంద్రం 2.10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా కేటాయించింది. గ‌త నెల బ‌కాయి 2.54 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌తో క‌లిపి సెప్టెంబ‌ర్ నెలఖారుకి మొత్తం 4.64 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా రావాల్సి ఉంది. గ‌తేడాది వానాకాలం సీజ‌న్‌లో కోటి 3 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేయ‌డం జ‌రిగింది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు కోటి 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట సాగు చేశారు. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది అధికంగా 36 శాతం పంట సాగు చేశారు. రాష్ర్టంలో పెరిగిన సాగును కేంద్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రాష్ర్టానికి కేటాయించిన యూరియా మొత్తాన్ని కోత‌లు లేకుండా స‌ర‌ఫ‌రా చేయాలి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 


logo