మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 10:40:07

'40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాములు'

'40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాములు'

హైద‌రాబాద్ : రాష్ర్టంలో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాముల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న ఉంద‌ని రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా గోదాముల నిర్మాణానికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్ట ఏర్పాటుకు ముందు 4 ల‌క్ష‌ల 17 వేల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో 176 గోదాములు ఉండేవ‌ని మంత్రి గుర్తు చేశారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత నాబార్డు స‌హాయంతో 17 ల‌క్ష‌ల 20 వేల మెట్రిక్ ట‌న్నుల నిల్వ సామ‌ర్థ్యంతో 452 గోదాములు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ర్టంలో ప్ర‌తి ఏడాది వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు పెరుగుతున్నాయి. దీన‌క‌నుగుణంగా గోదాములు నిర్మించేందుకు ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌న్నారు. రాష్ర్టంలో ఇప్ప‌టికీ 60 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాములు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. వ‌రికి త‌ప్ప ఇత‌ర పంట‌ల‌కు గోదాముల అవ‌శ్య‌క‌త ఉంది. కాబ‌ట్టి 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాముల‌ను నిర్మించ‌బోతున్నాం. ఈ గోదాముల‌కు అవ‌స‌ర‌మైన భూముల‌ను ముందుగానే సేక‌రించాల‌ని సీఎస్ తో పాటు క‌లెక్ట‌ర్ల‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే భూముల‌ను సేక‌రించాం. ఎక్క‌డా ఇబ్బంది లేద‌న్నారు. గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గ ప్రాంతాల్లో 40 వేల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాముల‌ను నిర్మించ‌బోతున్నాం. నాబార్డు స‌హాయంతో వీలైనంత త్వ‌ర‌గా గోదాముల‌ను ఏర్పాటు చేస్తాం.. నూత‌నంగా ఏర్ప‌డిన మండ‌లాల‌తో పాటు గ‌తంలో ఉన్న మండ‌లాల్లో ఎక్క‌డైతే గోదాములు లేవో అక్క‌డ నిర్మాణం మొద‌టి ద‌శ‌లోనే చేప‌డుతామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.


logo