సోమవారం 01 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:16:50

సంప్రదాయ సాగుకు స్వస్తి పలుకుదాం

సంప్రదాయ సాగుకు స్వస్తి పలుకుదాం

  • రైతుల్లో చైతన్యం తీసుకురావాలి
  • అధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సమగ్ర వ్యవసాయ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, సంప్రదాయ సాగునుంచి బయటపడేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. ఒకేరకమైన పంట సాగుతో రైతులు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వ సూచనల ప్రకారమే పంటలు సాగుచేసేలా వారిని సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకునే స్థాయికి చేరాలనేది ప్రభుత్వ అభిలాష అని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో త్వరలో సీఎం కేసీఆర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారని చెప్పారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో ప్రయోగాత్మకంగా 35 కోట్లు 

25వేలలోపు రైతురుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.35 కోట్లు జమచేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రత్యేక సాప్ట్‌వేర్‌ ద్వారా డూప్లికేషన్‌, రెండు, మూడు రుణ ఖాతాలను పరిశీలన, కుటుంబసభ్యుల పంటరుణాలు, ఆధార్‌ వంటివివాటిని చెక్‌ చేసేందుకు ప్రయోగాత్మకంగా వాటిని జమచేసినట్టు చెప్పారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) డూప్లికేషన్‌ను పరిశీలించాక రైతుల ఖాతా వివరాలను అన్నిబ్యాంకుల మేనేజర్లకు పంపుతామని,మరో మూడురోజుల్లోనే రూ.1200 కోట్లు మాఫీ సొమ్ము అర్హులైన రైతుల ఖాతాలకు చేరనున్నదని వివరించారు.


logo