మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 04, 2020 , 18:02:11

రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

వనపర్తి :  ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజాపేట మరియు కొత్తకోట మండల కేంద్రాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అద్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం  కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి.. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషల తో కలిసి  మంత్రి  ప్రారంభించారు.   ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రబీలో రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఎకరాలలో వరి పంట పండినట్లు తెలిపారు. గత సంవత్సరం 3000 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండేవాని, అయితే ఈ సంవత్సరం సాగునీటి ప్రాజెక్టులు కారణంగా ధాన్యం పోటెత్తినందున ఏడు వేల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను, క్రమపద్ధతిలో దాన్యాన్ని కొనుగోలు చేసే నిమిత్తం ఐకెపి, పిఎసిఎస్  ల ద్వారా పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో దాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు గాను కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు ,టార్పాలిన్లు గన్ని బ్యాగులు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్ కు రాకుండా అన్ని గ్రామ పంచాయతీలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా టోకెన్  సీరియల్ నెంబర్ ప్రకారం ముందే జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, కోసిన వరి ధాన్యం కోసినట్లుగా కొనుగోలు చేస్తామని , ఇందుకు వ్యవసాయ,  సహకార ,మార్కెటింగ్,  రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంటామని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, ముఖ్యంగా రైతులు ఎలాంటి పాసుబుక్కులు చూపించాల్సిన అవసరం లేదని, బ్యాంకు అకౌంట్ నెంబర్  కు సంబంధించిన వివరాలను  మాత్రం నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు రావద్దని, సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు . కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్, ఎంపీపీ కిచ్చా రెడ్డి,ఎం పి పో గుంత  మౌనిక ,జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ ,సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్,   బాల నారాయణ మాజీ జెడ్పిటిసి డాక్టర్ పి జే బాబు ,వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి ,పౌరసరఫరాల జిల్లా అధికారి రేవతి ,పౌరసరఫరాల మేనేజర్ లక్ష్మయ్య, మార్కెటింగ్ ఏడీ స్వరాన్ సింగ్  తదితరులు పాల్గొన్నారు 


logo