సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 02:34:56

ప్రపంచానికే తెలంగాణ సాగు పాఠం

ప్రపంచానికే తెలంగాణ సాగు పాఠం

  • నేల మీద నీళ్లను నిలిపిన గొప్ప చరిత్ర మనదే
  • బస్వాపూర్‌ సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి
  • పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ నేల మీద నిజాం నాటి నుంచి అవలంబిస్తున్న నీటి పారుదల వ్యవస్థనే ఆధునిక కాలంలో ప్రపంచ దేశాలకు సాగు పాఠంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో నేల మీద నీళ్లను నిలిపిన గొప్ప చరిత్ర తెలంగాణకే దక్కిందన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కామారెడ్డి జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ శోభ, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. కామారెడ్డి నియోజక వర్గంలో నిర్మించిన రైతువేదిక, పల్లె ప్రకృతి వనాలు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, గ్రంథాలయం, రోడ్ల నిర్మాణం, వైకుంఠ ధామాలను భిక్కనూర్‌, కామారెడ్డి, రాజంపేట మండలాల్లో ప్రారంభించారు. బస్వాపూర్‌లో రైతులనుద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. 1923లో నిజాంసాగర్‌ ప్రాజెక్టును యంత్రాల సాయం లేకుండానే 8 ఏండ్లలో నిర్మించారని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ కేవలం మూడేండ్లలో పూర్తిచేసి అన్నదాతల్లో సంతోషాన్ని నింపుతున్నారన్నారు. మూడో టీఎంసీ కడితే కాళేశ్వరం నుంచి 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. ఇప్పటికే వెయ్యి మీటర్ల లోతులో ఉండే భూగర్భ జలాలు కాళేశ్వరం వల్ల అనేక జిల్లాల్లో పైపైకి ఉబికి వస్తున్నాయని, ఈ మార్పు సీఎం కేసీఆర్‌ గొప్పతనానికి నిదర్శనమన్నారు. అంతరించిన పుశు, పక్షాదులు సైతం గ్రామాలకు, అడవుల్లోకి వస్తున్నాయని, జీవ వైవిధ్యం పురుడు పోసుకుంటున్నది తెలిపారు. రైతు వేదికలు సమావేశాల నిర్వహణకే కాదని భవిష్యత్తులో డిజిటల్‌ సాగు విధానాలకు వేదికగా నిలువబోతున్నాయని మంత్రి చెప్పారు.

పంట ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా రానున్న కాలంలో సాగు భూముల్లో పరీక్షలు నిర్వహించి భూసార కార్డులను రైతులకు అందిస్తామన్నారు. కరోనా మిగిల్చిన ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ యాసంగికి పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని, దీన్ని రైతులు, ప్రజలు గమనించాలని కోరారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఏ పని చేసినా బడుగు, బలహీన వర్గాల మేలు కోసమేనన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు కడతామంటే నవ్వినవాళ్లే నేడు ఆశ్చర్యపోతున్నారన్నారు. logo