మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:04

గతేడాది కన్నా ఎక్కువే ఇచ్చాం

గతేడాది కన్నా ఎక్కువే ఇచ్చాం

  • రైతులకు రుణాలపై మంత్రి నిరంజన్‌రెడ్డి
  • అసత్య కథనాలు దుర్మార్గం
  • రైతుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తారా?
  • తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
  • ఏ ఆధారాలతో రాశారో వివరణ ఇవ్వాలి
  • అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం

ప్రభుత్వం తీసుకుంటున్న అనుకూల నిర్ణయాలతో రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉన్నారు, ఈ సమయంలో వారు నిరాశ నిస్పృహల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్టు అసత్య కథనాన్ని ప్రచురించడం దుర్మార్గం. అప్పులులేని తెలంగాణ రైతాంగాన్ని చూడటం ఆ పత్రికకు రుచించటం లేదేమోనన్న అనుమానం కలుగుతున్నది. వానకాలంలో పంట రుణాల విడుదలపై గత నాలుగేండ్లతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువే ఇచ్చాం. 

-  మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గతంతో పోల్చితే ఈ సీజన్‌లో రైతులకు ఎక్కువ రుణాలను అందించామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్‌ నాలుగు వరకు రూ.11,93,000 కోట్లు రుణాలు ఇవ్వగా, గతేడాది ఇదే సమయానికి రూ.10,580 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈనాడు పత్రికలో ప్రచురితమైన వార్తాకథనంపై ఆయన స్పందిస్తూ.. కరోనా పరిస్థితుల్లోనూ గతేడాదికంటే ఎక్కువ రుణాలు అందజేశామని తెలిపారు. సహకార బ్యాంకులు గత ఏడాది ఇదే సమయానికి రూ.1296 కోట్ల రుణాలిస్తే.. ఈ ఏడాది ఇప్పటికే రూ.1516.88 కోట్లు రుణాలుగా అందజేశాయని చెప్పారు. 

వానకాలంలో పంట రుణాలపై నాలుగేండ్ల వివరాలు సేకరించినా ఈ ఏడాది ఇచ్చిన రుణా లు ఎక్కువేనని తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకు 11,77,326 మంది రుణాలుపొందగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 12,97,267 మంది రుణాలు పొందారని చెప్పారు. వీటన్నింటికీ మించి ఇంతటి కష్టకాలంలోనూ రైతుబంధు కింద రూ.7,251 కోట్లు అం దించామన్నారు. రూ.30 వేల కోట్ల విలువైన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఆ వివరాలేవీ పట్టించుకోకుండా రుణాలే ఇవ్వడం లేదం టూ ‘ఈనాడు’ దినపత్రిక కథనాన్ని ప్రచురించడాన్ని ఆయన ఖండించారు. రైతు అవసరం ఉంటే తప్ప రుణాలు తీసుకోడని అన్నారు. 

రైతులు అప్పుల బారిన పడకూడదనే రైతుబంధు, రుణమాఫీ తదితర సదుపాయాలను అందిస్తున్నట్టు చెప్పారు. కానీ.. రైతుల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఈనాడు పత్రిక నిరాధారమైన కథనం ప్రచురించిందని విమర్శించారు. దానిని సమీక్షించుకొని బుధవారం పునఃప్రచురించాలని డిమాండ్‌ చేశారు. ఆ పత్రికలో వారి కథనానికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారో తమ అభిప్రాయాన్నీ అదేస్థాయిలో ప్రచురించాలన్నారు. లేనిపక్షంలో చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ఈనాడు కథనంపై మంగళవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని, ఈ సమయంలో వారు నిరాశనిస్పృహల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్టు అసత్య కథనాన్ని ప్రచురించడం దుర్మార్గమని అన్నారు. 

అప్పులులేని తెలంగాణ రుచించడం లేదా!

అప్పులులేని తెలంగాణ రైతాంగాన్ని చూడటం ఆ పత్రికకు రుచించటం లేదోమోనన్న అనుమానం కలుగుతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న పథకాల వల్ల అప్పుల ఊబి, ఆత్మహత్యలు, కరువు కాటకాలు దూరమై, సుసంపన్నమైన రాష్ట్రం ఆవిష్కృతమవుతున్నదని చెప్పారు. కరోనాతో రాష్ట్ర రాబడి రూ.50 వేల కోట్లు తగ్గినా రైతుబంధు ద్వారా రూ.7,251 కోట్ల పెట్టుబడి సాయం అందించామని అన్నారు. నియంత్రిత సాగుకు సీఎం కేసీఆర్‌ పిలుపునిస్తే రాష్ట్ర రైతాంగం తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నదని తెలిపారు. సోమవారం వరకు రాష్ట్రంలో 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్టు చెప్పారు. రూ.25వేలలోపు రుణాలున్నటువంటి 2.87 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు తెలిపారు. 

గతేడాది వివిధ బ్యాంకుల నుంచి 41,31,004 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారని వెల్లడించారు. ఇందులో సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు 20% కాగా మిగతావారు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు తెలిపారు. ఆరేండ్లుగా వ్యవసాయరంగంలో తీసుకున్న చర్యలు, 70% సాగునీటి రాకతో పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలపడ్డారని చెప్పారు. వ్యవసాయరంగం బలోపేతం కావడంతో వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ వృత్తులు జీవం పోసుకుంటున్నాయని, సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో గ్రామీణులు సొంత కాళ్లపై నిలబడే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఎస్సెల్బీసీ కన్వీనర్‌ సీతాపతిశర్మ, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, టెస్కాబ్‌ ఎండీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  


రుణాల వివరాలు
రూ. కోట్లలో
ఆగస్టు 4వ తేదీ వరకు ఇచ్చిన రుణాలు
11,093 
గతేడాది జూలై వరకు ఇచ్చిన మొత్తం
10,580 
సహకార బ్యాంకుల ద్వారా ఇచ్చినవి
1516.88  
గతేడాది ఇచ్చిన రుణాలు
1296


రుణాలు పొందిన రైతుల వివరాలు

ఈ ఏడాది ఇప్పటి  వరకు పొందినవారు 12,97,267 మంది
గతేడాది ఈ సమయం వరకు రుణాలు పొందింది11,77,326 మంది


logo