ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:00:17

సన్నాలకు ‘మద్దతు’ను మించి ధర

సన్నాలకు ‘మద్దతు’ను మించి ధర

  • ఎక్కువ రేటు చెల్లించడానికి కేసీఆర్‌ సర్కార్‌ రెడీ 
  • కేంద్రం మోకాలడ్డుకోకుండా ఆపగలవా?
  • కిషన్‌రెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సన్న వడ్లకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.1888 కంటే అధికంగా చెల్లించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సిద్ధంగా ఉన్నదని.. దీనికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుకోకుండా ఆపగలవా?, ఆ బాధ్యతను నువ్వు తీసుకుంటావా? అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. మద్దతు ధరను మించి ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించినా తాము కొనుగోలు చేయమని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో రైతు వేదికల ప్రారంభోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునాథపాలెంలో జరిగిన సభలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ద్వారా తెలంగాణకు ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిందని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్రంలో 18 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని.. అంతకు మించితే కనీస మద్దతు ధర ఇవ్వమంటూ ఉత్తర్వులు జారీచేయడం వెనుక మర్మం ఏమిటో చెప్పాలని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. మద్దతు ధర రూ.1888 కంటే రైతులకు ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించినా.. బోనస్‌ ప్రకటించినా తాము కొనుగోలు చేయమంటూ కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా ఉత్తర్వులివ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను కాపాడుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సన్న వడ్లపై ఎంతోకొంత పెంచే ఆలోచనలో ఉన్నదని.. కేంద్రం ప్రతికూల నిర్ణయం అమలుకాకుండా బాధ్యత తీసుకుంటావా? అని సవాల్‌ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు కుటుంబానికి బిడ్డనిచ్చి పెళ్లి చేసేందుకు వెనుకడుగు వేసేవారనీ, కేసీఆర్‌ సర్కార్‌లో రైతు కుటుంబాలకు గౌరవం పెరిగి పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకొస్తున్నారని స్పష్టంచేశారు.