ఆదివారం 31 మే 2020
Telangana - May 02, 2020 , 20:09:48

ఉమ్మడి పాలమూరులో సాగులోకి 22 లక్షల ఎకరాలు

ఉమ్మడి పాలమూరులో సాగులోకి  22 లక్షల ఎకరాలు

వనపర్తి:  వనపర్తి జిల్లా గణపురం మండలం షాపూర్ వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.  ఐదు గ్రామాలు, 10 గిరిజన తండాలలోని నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు  చిన్న నీటి  చెరువులను నీటితో నింపే ఉద్దేశంతో  చేపట్టనున్న వనపర్తి జిల్లా ఘనపురం మండలం కర్నే తాండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సర్వే డిపి ఆర్ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంగీకరించగా  ప్రభుత్వం జీవో 69 విడుదల చేసినట్లు మంత్రి  తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు వెంటనే టెండర్లు పిలిపించి మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా పాలమూరు జిల్లా వలసలకు, దరిధ్యానికి నిలయంగా మారిందని, తెలంగాణ వస్తే అన్నపూర్ణగా రాష్ట్రం మారుతుందని భావించి తెలంగాణను తీసుకురావడం జరిగిందని, ఊహించినట్లుగానే నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వటం వల్ల ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇక్కడి ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూనే దేశానికి అన్నం పెట్టే అక్షయపాత్ర గా మారిందని అన్నారు .

రానున్న సంవత్సరంలో రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా పంటలు పండేందుకు అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని వాన కాలానికి అవసరమైన ఎరువులు, విత్తనాలపై కేంద్ర ప్రభుత్వానికి 22 లక్షల మెట్రిక్ టన్నుల కు ఆమోదం పొందామని,  ఐదు లక్షల మెట్రిక్ టన్నుల  బఫర్ ఎరువులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. వితనాలకు సంబంధించి రానున్న వాన కాలంలో రాష్ట్రంలో కోటి 35 లక్షల ఎకరాలలో  వివిధ రకాల పంటలు సాగు చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు  3 వ లిఫ్ట్ ఏడాదిలో పూర్తవుతుందని ,పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగిరపరచనున్నామని ఆయన వెల్లడించారు. 

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం దాదాపు 7 నియోజకవర్గాలలో పది లక్షల ఎకరాల్లో పంట పండిందని, వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ  పందెందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఈ సంవత్సరానికి మించిన ధాన్యరాశులు వచ్చే సంవత్సరం మనం చూడబోతున్నాం అని తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఒక్క లక్ష ఎకరాలలో వరి సాగు చేస్తే అందులో 23 లక్షల ఎకరాలలో సన్నాలు పండించారని తెలిపారు. 2020 సంవత్సరపు  ప్రతిపాదిత జనాభా ప్రకారం రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉన్నారని, తలసరి 13 కిలోల బియ్యం అవసరం కాగా రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని,  వచ్చే వానకాలం 50 లక్షల ఎకరాలలో వరి సాగు చేసిన కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని, అంతేకాక యాసంగి పంట కూడా వస్తుందని అందువల్ల రాష్ట్ర ఆహార అవసరాలను తీర్చటమే కాకుండా ఇతర ప్రాంతాలకు ధాన్యాన్ని సరఫరా చేసే స్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండున్నర సంవత్సరాలలో 22 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉందని, పాలమూరు-రంగారెడ్డి ద్వారా పది లక్షలు, ప్రస్తుతం సాగుతున్న 10 లక్షలు ఎకరాలు, అలాగే నీటిపారుదల ప్రాజెక్టుల కారణంగా ఊట ద్వారా లక్షా 50 వేల ఎకరాలు, అంతేకాక చిన్న నీటి పారుదల ద్వారా మరో రెండు లక్షల ఎకరాలు మొత్తం 22 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని, రానున్న రెండేళ్లలో  పచ్చబడ్డ పాలమూరును మనం చూడబోతున్నాం అని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఎంపీపీ కృష్ణా నాయక్ ,జడ్పిటిసి సామ్య నాయక్ , సర్పంచ్ బాలంజనేయులు గౌడ్,మార్కెటింగ్ శాఖ ఎడి స్వర్ణ సింగ్ ,డి ఈ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.


logo