సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 01:27:34

అత్యవసరాల్లో ఆపన్నహస్తం

అత్యవసరాల్లో ఆపన్నహస్తం

-ట్విట్టర్‌ ద్వారా పలువురి సమస్యలకు మంత్రి కేటీఆర్‌ పరిష్కారం

-ఆంధ్రప్రదేశ్‌వాసులకూ భరోసా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్టంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల అత్యవసర సమస్యలకు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పరిష్కారం చూపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌వాసులకు భరోసా కల్పించారు. మంగళవారం రాత్రి ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్‌ హైదర్‌నగర్‌లోని రెయిన్‌బో దవాఖానలో ఈనెల 28న తనకు స్కానింగ్‌ ఉన్నదని.. అక్కడకు వచ్చేందుకు సాయం చేయాలంటూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాంతిజ్యోతి అనే ఏడునెలల గర్భిణి ట్విట్టర్‌లో కోరారు. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ తమ సిబ్బంది సాయం చేస్తారని భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చక్రధర్‌ మంత్రికి ట్వీట్‌చేస్తూ.. ఏప్రిల్‌ మొదటివారంలో తన సోదరికి వైద్యులు ప్రసవం  తేదీ ఇచ్చారని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమెకు తన తల్లి సాయం కావాల్సి ఉన్నదని తెలిపారు. కేటీఆర్‌ స్పందిస్తూ తమ బృందం సాయం చేస్తుందని పేర్కొన్నారు. జగిత్యాలకు చెందిన శ్రీనివాస్‌ తొమ్మిది నెలల గర్భిణి అయిన భార్యను హైదరాబాద్‌లోని కుటుంబసభ్యుల వద్దకు పంపేలా సాయం చేయాలని కోరగా.. తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అత్యవసరాల్లో ఉన్నవారు 100కు డయల్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని, ప్రతిఒక్కరూ ఆ నంబరుకు డయల్‌ చేసి సాయం పొందాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈనెల 25న తన భార్యకు ప్రసవ సమయం ఉన్నదని.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు చెంగిచెర్ల నుంచి నాగోల్‌ రాక్‌టౌన్‌ కాలనీకి తరలించేందుకు రవాణా సదుపాయం కల్పించాలని రేవంత్‌రెడ్డి కోరగా.. కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సత్యను కూడా తన కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. 

రవాణా సదుపాయం కల్పించండి

పెరిటోనియల్‌ డయాలసిస్‌తో బాధపడుతున్న వరంగల్‌కు చెందిన పృథ్వీధర్‌ ట్వీట్‌చేస్తూ.. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు డయాలసిస్‌ బ్యాగుల సరఫరా నిలిచిపోయిందని.. వాటిని పొందేందుకు సాయంచేయాలని కోరారు. దీంతో తమ ఆఫీసును సంప్రదించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. నర్సుగా పనిచేసే తనతల్లి ఇంటినుంచి దవాఖానకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని లిఖిత మాథ్యూస్‌ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తనతల్లితోపాటు అనేకమంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరికీ రవాణా సదుపాయం కల్పించాలని కోరగా కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

ఆపత్కాలంలో ఉన్నాం పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలి: మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో యావత్‌ సమాజమంతా ఆపత్కాలంలో ఉన్నదని, ఈ మహమ్మారి నుంచి తప్పించుకొనేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తిచేశారు. ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆయన కోరా రు. ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ మంగళవారం తన శాఖల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణా ల్లో పారిశుద్ధ్యం మెరుగుదలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు వైద్య శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ఖాళీగా ఉన్న రోడ్లపై మరమ్మతులను చేపట్టాలని, లాక్‌డౌన్‌ సమయాన్ని ఈ పనులకు ఉపయోగించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ వల్ల అసంఘటితరం గ కార్మికుల ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే అవకాశమున్నందున రూ.5 భోజనం (అన్నపూర్ణ) కౌంటర్లను కొనసాగించాలని, ఆయా కౌంటర్ల వద్ద ఒకేసారి జనం గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సీఎస్సార్‌ నిధులను వినియోగించాలి

కరోనా వైరస్‌ నియంత్రణకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) నిధులను ఉపయోగించేందుకు కంపెనీలు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. పారిశ్రామికవాడల్లోని కాంట్రాక్టు, రోజువారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రజలంతా ఇండ్లకే పరిమితమవడంతో ఇంటర్నెట్‌ వినియోగం భారీ గా పెరిగిందని, ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు బ్యాండ్‌విడ్త్‌ని పెంచాలని ఇంటర్నెట్‌ స ర్వీస్‌ ప్రొవైడర్లను కోరారు. అత్యవసర సేవల్లో నిమగ్నమైన సిబ్బందికి అక్కడక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వీరి విషయంలో పోలీసులు సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని హోంమం త్రి మహమూద్‌ అలీ, డీజీపీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 


logo