శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 01:28:42

సాహసాలకు ఇదే సమయం

సాహసాలకు ఇదే సమయం

  • పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలి
  • కరోనా సంక్షోభంతో విస్తృత అవకాశాలు
  • ఎంపవర్డ్‌ స్ట్రాటజిక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలి
  • ఈవోడీబీ టాప్‌ 20లోకి భారత్‌ను చేర్చాలి
  • కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభంతో ఏర్పడిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ విధానాల్లో కూడా సమూల మార్పులు రావాల్సిన అవసరమున్నదన్నారు. సులభతర వాణిజ్య విధానాలను(ఈవోడీబీ) కూడా మార్చి దేశాన్ని టాప్‌20 జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌కు శుక్రవారం ఒక లేఖ రాశారు. దేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకొనిరావడంతోపాటు ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కొన్ని సూచనలు చేశారు. లేఖలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

దేశ ఆర్థిక వ్యవస్థ, రానున్న పెట్టుబడులు, పరిశ్రమలపై ఒక ఎంపవర్డ్‌ స్ట్రాటజిక్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు, పాలసీ నిపుణులు ఉండాలి.పాతకాలంనాటి కార్మిక చట్టాలతోపాటు బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన చట్టాలను సమూలంగా మార్చాలి.ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా పెట్టుబడులపై స్థిరమైన, కచ్చితమైన, నమ్మకమైన, విధానాలు ఉండాలి.దేశంలో మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మెగా ఇండస్ట్రియల్‌ పార్కులైన హైదరాబాద్‌ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ వంటి వాటికున్న జాతీయ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటికి మద్దతు ఇవ్వాలి.భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేసి అన్ని వసతులు కల్పించాలి. వాటిలోనే శిక్షణ సంస్థలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేయాలి. ఆర్థిక వ్యవస్థ బలపడితే ప్రపంచంతో పోటీపడే వీలుంటుంది. ఆ దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది.ఫార్మా రంగం, ఏరోస్పేస్‌, టెక్స్‌టైల్స్‌, లెదర్‌, ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలంటే ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలపై నిరంతరం పరిశీలనచేస్తూ ఇతర దేశాలతో పోటీపడాలి. ఆయా పెట్టుబడులు వచ్చిన తర్వాత అందుకు అవసరమైన శిక్షణ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాలి. ప్రోత్సాహకాలను ముఖ్యం గా ఎగుమతులకు సంబంధించి రాయితీలను అందించాలి.

ఎస్‌ఎంఈలను కాపాడుకోవాలి

దేశంలోకి భారీ పెట్టుబడులను రప్పించడంతోపాటు స్థానికంగా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. మనదేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివన్నారు. ప్రస్తుతం ఆపత్కాలంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నేరుగా ఆర్థిక సహాయం అందించే అంశాన్ని పరిశీలించాలని, అవసరమైతే ఆయా సంస్థలకు ఉన్న బకాయిల వసూలుకు కొంత విరామం ఇవ్వాలని లేఖలో సూచించారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ కొత్త అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ పారిశ్రామికరంగం ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కరోనా కట్టడిలో భారత్‌ ఇప్పటికే ఒక బలమైన సందేశం ఇచ్చింది. మనకున్న బలాలను ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం దొరికింది.


logo