గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 15:28:10

హైవే 65 అభివృద్ధికి 500 కోట్లు ఇవ్వండి : కేటీఆర్

హైవే 65 అభివృద్ధికి 500 కోట్లు ఇవ్వండి : కేటీఆర్

హైద‌రాబాద్ : కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు రూ. 500 కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. న‌గ‌ర ప‌రిధిలో హైద‌రాబాద్ - విజ‌య‌వాడ హైవే సుమారు 25 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉంది. హైద‌రాబాద్‌లో అత్యంత ర‌ద్దీ ప్రాంతాల్లో ఉన్న ఈ హైవేకు ప్ర‌త్యేకంగా లెవ‌ల్ జంక్ష‌న్లు, స‌ర్వీస్ రోడ్డు వంటి సౌక‌ర్యాలతో పాటు లేన్ కెపాసిటీని మ‌రింత‌గా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకోసం రాష్ర్ట ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ రూ. 500 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో పెరుగుతున్న విస్త‌ర‌ణ‌కు అనుగుణంగా తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం ప్రాజెక్టులు చేప‌ట్టింద‌ని కేటీఆర్ త‌న లేఖ‌లో తెలిపారు. 

కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ చొర‌వ‌తో న‌గ‌రానికి నాలుగు అర్బ‌న్ ప్రాజెక్టులు వ‌చ్చాయి. ఇందులో మూడు ప్రాజెక్టుల‌కు సంబంధించిన నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్‌కు సంబంధించిన ప‌నులు ప్రారంభిస్తాం. రాష్ర్ట ప్ర‌భుత్వ విధానాల‌తో పాటు హైద‌రాబాద్‌కు ఉన్న భౌగోళిక అడ్వాంటేజ్ వ‌ల‌న న‌గ‌రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు.

ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో అగ్ర‌గామి సంస్థ‌లైన అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థ‌లు త‌మ రెండవ అతిపెద్ద కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏర్పాటు చేశాయి. వీటితో పాటు న‌గ‌రంలో ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఇప్ప‌టికే మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేశామ‌న్నారు. ఎస్సార్డీపీ కార్య‌క్ర‌మం ద్వారా అనేక ఫ్లై ఓవ‌ర్లు, రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి, రైల్వే అండ‌ర్ బ్రిడ్జిల‌ను పూర్తి చేయ‌డంతో పాటు పెద్ద ఎత్తున లింకు రోడ్ల సౌక‌ర్యం క‌ల్పించామ‌ని తెలిపారు. రాష్ర్ట ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున చేప‌ట్టిన మౌలిక వ‌స‌తుల కార్య‌క్ర‌మానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు హైద‌రాబాద్ - విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారికి అద‌నంగా రూ. 500 కోట్లు కేటాయించాలి అని కేటీఆర్ కోరారు.


logo