సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 20:31:22

ఐటీఐఆర్‌పై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ‌

ఐటీఐఆర్‌పై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ‌

హైద‌రాబాద్ : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కి కేటీఆర్ లేఖ రాశారు. 2014 నుంచి ఐటీఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని, కనీసం ఇప్పటికైనా ఐటీఐఆర్‌ను పునరుద్ధరించడం లేదా అంతకు మించి మేలైన మరొక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. 2008లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని ఇందుకు సంబంధించి 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఐటీఐఆర్ కోసం 49,000 ఎకరాలతో పాటు మూడు క్లస్టర్ లను హైదరాబాద్‌లో గుర్తించడం జరిగిందన్నారు. తద్వారా అనేక నూతన ఐటీ కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 

సుమారు రూ. 3275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకు సంబంధించి రెండు దశల్లో ఈ నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి దశ కార్యక్రమానికి సంబంధించి రూ. 165 కోట్లతో 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని, మిగిలిన రెండవదశకు సంబంధించి వివిధ దశలుగా 20 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ మొదటిదశలో భాగంగా గుర్తించిన పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రైల్వే, రోడ్డు ర‌వాణా శాఖలకు సంబంధించి అదనపు బడ్జెట్ నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తుంద‌న్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పటి వరకు హైదరబాద్ లో ఐటీఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. 

2014లో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని, 2017లో ఇందుకు సంబంధించి ఐటీఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదన్నారు. ఐటీఐఆర్ పైన ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు విజ్ఞప్తులు కూడా అందించారన్నారు. గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత కీలకమైన కార్యక్రమం పైన ఎలాంటి స్పందన రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీ పరిశ్రమకు సంబంధించి ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశం పైన ఎలాంటి స్పందన లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి రంగంలో గొప్ప వృద్ధిని తెలంగాణ సాధించిన‌ట్లు తెలిపారు. 2014 లో ఉన్న రూ. 57,258 కోట్ల ఐటీ ఎగుమతులను 2019- 20 నాటికి రూ. 1,28,807 కోట్లకు పెరిగేలా చేశామన్నారు. మొత్తంగా తెలంగాణ గత ఆరు సంవత్సరాలు స్థూలంగా 110 శాతం వృద్ధిని సాధించిందని, ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ అని తెలిపారు. 

ఐటి ఉద్యోగుల సంఖ్య సైతం దాదాపుగా రెట్టింపు అయిందని, హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ వంటి సంస్థలు నగరాన్ని తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా ఎంచుకున్నయని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాకుండా నూతన టెక్నాలజీ లైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాట అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీస్, గేమింగ్, అనిమేషన్, గ్రాఫిక్స్, బ్లాక్ చైన్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నదని తెలిపారు. దీంతోపాటు ఇన్నోవేషన్ రంగంలోనూ టి హబ్, టి వర్క్, వి హబ్, టాస్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ చేపట్టిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ప్రస్తుత కరోనా సంక్షోభం లోనూ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ పెద్దగా ఇబ్బందులు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించగలిగాయన్నారు. 

ఇలాంటి  అత్యంత కీలకమైన సమయంలో హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ పథకాన్ని లేదా అంతకు మించి మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే ఐటీ పరిశ్రమ వృద్ధికి బలమైన ఊతం ఇస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఐటీఐఆర్‌ని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణలో అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు.


logo