ఉద్యోగులకు శుభవార్త! ఇకపై ఉద్యోగం మానేస్తే పాత కంపెనీల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గతంలో అయితే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా.. విత్‌డ్రా చేయాలన్నా పాత కంపెనీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక్కోసారి పాత కంపెనీలు తమ చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేసేవి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఉద్యోగం మానేసినప్పుడు కలిగే ఇబ్బందులను గమనించిన ఈపీఎఫ్‌వో సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో పాత కంపెనీ అనుమతి లేకుండానే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం గానీ.. వేరే కంపెనీకి బదిలీ గానీ చేసుకునే వెసులుబాటును కల్పించింది.
గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరినప్పుడు పీఎఫ్ ఖాతా బదిలీ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. అలా పీఎఫ్ ఖాతా బదిలీ చేసుకోవాలని అనుకుంటే పాత కంపెనీలో ఉద్యోగం మానేసిన తేదీని నమోదు చేయాలి. అలా చివరి తేదీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే పీఎఫ్ ఖాతా బదిలీ సాధ్యమయ్యేది.. పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. దీంతో పాత కంపెనీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక్కోసారి పాత కంపెనీలు ఇబ్బందులు కూడా పెట్టేవి.
ఉద్యోగుల సమస్యలను గమనించిన ఈపీఎఫ్‌తో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పీఎఫ్ ఖాతాలో ఎగ్జిట్ డేట్‌ను కంపెనీలే కాకుండా ఉద్యోగులు కూడా అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అయితే ఒక కంపెనీలో మానేసిన రెండు నెలల తర్వాత మాత్రమే పీఎఫ్ ఖాతాదారులు ఎగ్జిట్ డేట్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగి జాబ్ మానేసిన తర్వాత పాత కంపెనీ ఏ నెలలో అయితే పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను యాడ్ చేస్తుందో.. ఆ నెలలో ఏ తేదీని అయినా ఎగ్జిట్ డేట్‌గా ఎంటర్ చేయవచ్చు. పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
– మొదట ఈపీఎఫ్‌వో లాగిన్ పేజి (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) ఓపెన్ చేయాలి. UAN నంబర్, పాస్వర్డ్ వివరాలతో పేజిలో లాగిన్ అవ్వాలి.
– కొత్త పేజి ఓపెన్ అయ్యాక మేనేజ్ విభాగంలో ఉన్న మార్క్ ఎగ్జిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజి ఓపెన్ అవుతుంది.
– అందులో సెలెక్ట్ ఎంప్లాయిమెంట్ బటన్‌పై క్లిక్ చేసి.. మీ పాత కంపెనీ ఇచ్చిన పీఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి.
– అక్కడ మన పాత కంపెనీ పేరు, ఖాతా నంబర్, చివరగా పీఎఫ్ కంట్రిబ్యూషన్ యాడ్ అయిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలను సరిచూసుకున్న తర్వాత ఎగ్జిట్ డేట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ డిపాజిట్ అయిన నెలలో ఏ తేదీని అయినా ఎగ్జిట్ డేట్‌గా ఎంచుకోవచ్చు.
– ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత, కంపెనీ నుంచి ఎందుకు బయటకు వచ్చామో కారణాన్ని అక్కడ ఎంటర్ చేయాలి.
– ఆ తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మన ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
– ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఎగ్జిట్ డేట్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని పాప్ అప్ కనిపిస్తుంది.