గురువారం 02 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 18:51:49

శంషాబాద్ నర్సరీలో మంత్రి కేటీఆర్

శంషాబాద్ నర్సరీలో మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఈసారి హరితహారాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.  ముఖ్యంగా పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడం తోపాటు వాటిని పెంచడం పైన దృష్టిసారించింది. ఈనెల 25నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ శంషాబాద్‌లోని ప్రభుత్వ నర్సరీని సందర్శించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఎన్నిరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రజలకు అందించే ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగ క్షేమాలు వాకబు చేశారు.   ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఇస్తున్నారా? అని అడగగా కార్మికులు లేదని చెప్పారు. అధికారులతో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేస్తానని మంత్రి చెప్పారు. 

హైదరాబాద్‌ మహానగరంతో పాటు పురపాలక పట్టణాల్లో హరితహారంపై ఇప్పటికే ఆ శాఖ తరపున ప్రత్యేక అదేశాలు జారీ చేశారు.  హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కలు కావాల్సి వస్తే హెచ్‌ఎండీఏ పరిధిలోని నర్సరీల నుంచి  మొక్కలను ఉచితంగా సరఫరా చేసే ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీలున్న ప్రాంతాలతో పాటు వాటి ఫోన్‌ నెంబర్లు, ఏయే మొక్కలు సరఫరా చేస్తారు వంటి వివరాలన్నింటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు పోదామని మంత్రి పిలుపునిచ్చారు. logo