శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:31

కండ్లముందే నీలి విప్లవం

కండ్లముందే నీలి విప్లవం

  • త్వరలో ఇతర రాష్ర్టాలు, దేశాలకు..చేపలు, రొయ్యల ఎగుమతి
  • అన్ని ప్రాంతాల్లో రైతుబజార్లు 
  • సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్‌

సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాల్టీలలో చేపడుతాం. నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటా. సిరిసిల్ల జిల్లాను ప్రయోగ కేంద్రంగా తీసుకుంటాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది.

- మంత్రి కేటీఆర్

రాజన్నసిరిసిల్ల, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మన కండ్లముందే నీలి విప్లవం రాబోతున్నదని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషితో సాగునీటి రంగంలో అద్భుతాలు, విప్లవాలు మన కండ్లముందే ఆవిష్కృతమయ్యాయని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాల్లో మన న్యాయమైన వాటాను వాడుకోవడం వల్ల హరిత తెలంగాణ కల సాకారమవుతున్నదని చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ మంగళవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యమానేరు, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌తో పాటు కొత్త ప్రాజెక్టులు, కొత్త చెరువులు నింపుకోవడం వల్ల మత్స్య పరిశ్రమ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. దీంతో ఇతర రాష్ర్టాలకు, దేశాలకు చేపలు, రొయ్యలను ఎగుమతిచేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతున్నదని చెప్పారు. ‘దేశం అబ్బురపడేలా తెలంగాణలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నాం. గత 50 ఏండ్లలో ఎన్నడూ నిండని చెరువులు, కుంటలు ఎర్రని ఎండల్లో మత్తడి దుంకుతున్నాయంటే మనం సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం వల్లనే’ అని మంత్రి కేటీఆర్‌ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల కోర్టు కేసులను ఎదుర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడం సీఎం కేసీఆర్‌ ఘనతేనన్నారు.


సంక్షేమాన్ని మరువలేదు.

రైతులకు ఇంతకుముందే తమ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. కరోనా వ్యాప్తితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని.. ఈ కష్టకాలం లోనూ తమ ప్రభుత్వం సంక్షేమాన్ని మరువలేదని చెప్పారు. రూ.25వేల లోపు రుణాలున్న 5.60 లక్షల మంది రైతుల రుణమాఫీకి రూ. 1,200 కోట్లు విడుదలచేశామని, 52లక్షల మం ది రైతులకు రూ.5,200 కోట్లు పంట పెట్టుబడి అందించామని పేర్కొన్నారు. వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌ను ఏఐసీసీ నేత అభిషేక్‌ సింఘ్వీ అభినందించారని గుర్తుచేశారు. 

రాష్ట్రంలో అన్ని చోట్ల రైతుబజార్లు

రాష్ట్రంలో అన్నిచోట్ల అధునాతన రైతుబజార్లు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాల్టీలలో చేపడుతున్నట్లు చెప్పారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటానని పునరుద్ఘాటించారు. సిరిసిల్ల జిల్లాను ప్ర యోగ కేంద్రంగా తీసుకుంటున్నట్లు తెలిపారు.  అందరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని కోరారు. కూరగాయల వ్యాపారులు బట్ట సంచులు, మాంసం వ్యాపారులు టిఫిన్‌ బాక్సులు తెచ్చుకున్న వారికే విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఆహారశుద్ధి కేంద్రాలు

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో ఆహారశుద్ధి కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో భాగంగా స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయని చెప్పారు. logo