గురువారం 28 మే 2020
Telangana - May 12, 2020 , 01:35:48

అండగా ఉంటాం

అండగా ఉంటాం

  • కరోనా వేళ నేత కార్మికులు అధైర్యపడొద్దు
  • జౌళిరంగంలో ఉజ్వల అవకాశాలు.. వాటిని అందిపుచ్చుకుంటాం
  • అందుకే వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ 
  • బతుకమ్మ చీరెల తయారీతో నేతన్నకు ప్రపంచస్థాయి గుర్తింపు
  • సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కే తారకరామారావు

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: జౌళిరంగంలో ఉన్న ఉజ్వలమైన అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. అందులో భాగంగా వేలమందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌ పార్కును అన్నివిధాలుగా అభివృద్ధిచేస్తామని హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని నేతన్నలకు, యజమానులకు భరోసా ఇచ్చారు. బతుకమ్మ చీరెల తయారీతో ప్రపంచవ్యాప్తంగా నేతన్నకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్స్‌ పార్కులో రూ.14.50 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌, పరిపాలనా భవనం, సమర్థ కుట్టుశిక్షణ కేంద్రం, భోజనశాలను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం తంగళ్లపల్లి మార్కండేయ ఆలయంలోని సమావేశ మందిరంలో పేదలకు ఉచిత బియ్యం, నగదును అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. చేనేత, జౌళిశాఖను ఆదుకొనేందుకు తగిన సాయంచేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసినట్టు తెలిపారు. టెక్స్‌టైల్స్‌ రంగంలో నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులతో సిరిసిల్ల బ్రాండ్‌కు ఇమేజ్‌ రావాలని ఆకాంక్షించారు. కార్మికుల నైపుణ్యం వెలికితీసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. 

కరోనా నేపథ్యంలో కార్మికులంతా వెళ్లిపోతుంటే పరిశ్రమలు ఇబ్బందుల్లో పడుతాయని, కార్మికులకు కడుపునిండా బువ్వ పెట్టి వారికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులపై ఉన్నదన్నారు. కార్మికులతో చేసుకున్న ఒప్పందాలు అమలుచేయాలని, సమ్మెలు లేకుండా చూసుకోవాలని సూచించారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించడానికి రంజాన్‌, క్రిస్మస్‌, బతుకమ్మ చీరెలు, విద్యార్థులకు యూనిఫాంల తయారీ ఆర్డర్లు పెద్దఎత్తున ఇస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా మరమగ్గాల కార్మికులతోపాటు చేనేత కార్మికుల సంక్షేమానికి చేనేత మిత్ర, చేనేత లక్ష్మి, రుణమాఫీ, యార్న్‌ సబ్సిడీ, బీమా సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. చేతినిండా పని, పనికి తగ్గ వేతనంతో జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పరిశ్రమలకు రూ.వేల కోట్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు, నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. టెక్స్‌టైల్‌పార్కులో మహిళలకు శిక్షణ ఇచ్చి వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు ప్రకటించారు.


కొత్తడిజైన్లతో బతుకమ్మ చీరె 

ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరెలు సరికొత్త డిజైన్లతో తయారుచేస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కోటి చీరెలను వంద డిజైన్లతో చేస్తున్న నేపథ్యంలో తయారైన చీరెను మంత్రికి చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ చూపించారు. ఎరుపు రంగులో గీతలు, జరీ అంచుతో తయారైన చీరెను చూసి మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆడబిడ్డలకు భవిష్యత్‌లో ఇంకా మంచి నాణ్యమైన చీరెలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఆర్డీవో శ్రీనివాస్‌, మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, చేనేతజౌళిశాఖ ఏడీ అశోక్‌రావు, సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, టెక్స్‌టైల్‌ పార్కు సం ఘం అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌ పాల్గొన్నారు.

ఎస్సారార్‌ను తిలకించిన మంత్రి కేటీఆర్‌

బోయినపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని మంత్రి కేటీఆర్‌ తిలకించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటన అనంతరం తన ఆరుగురు స్నేహితులతో కలిసి జలాశయాన్ని సందర్శించారు. జలాశయం నీటిని, గేట్ల ద్వారా ఎల్‌ఎండీకి వెళ్తున్న ప్రవాహాన్ని పరిశీలించారు. కిందికి దిగి బ్యాక్‌ వాటర్‌ను చూసి, ఈఈ రామకృష్ణతో మాట్లాడారు. జలాశయం నీటి సామర్థ్యం, పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అపారెల్‌ పార్కుతో మహిళలకు ఉపాధి

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సిరిసిల్లలో అపారెల్‌ పార్కు ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. టెక్స్‌టైల్స్‌ పార్కు అభివృద్ధికి రూ.24.50 కోట్లు వెచ్చించామన్నారు. సీజీడీఎంఎస్‌ కింద రుణాలు తీసుకొని సంక్షోభంలో కూరుకుపోయి మూతపడ్డ 18 చిన్న పరిశ్రమలను ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1.8 కోట్లు ఖర్చుచేసి తెరిపించిందన్నారు. కరోనా నేపథ్యంలో కార్మికులు నడుచుకుం టూ స్వగ్రామాలకు వెళ్తుంటే పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయని, కార్మికులను బాగా చూసుకోవాలని యజమానులకు సూచించారు. కరోనా నేపథ్యంలో పరిశ్రమలను ఆదుకొనేందుకు ప్రభుత్వం కరెంటు బకాయిలు మూడునెలలపాటు వాయిదా వేయించినట్టు గుర్తుచేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి కార్మికుడూ రూ.10 వేల నుంచి రూ.20 వేలు సంపాదించేలా శక్తిని, నైపుణ్యాన్ని ఇచ్చే బాధ్యత సర్కారుదేనని స్పష్టంచేశారు. పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నవారికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.


logo