శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 01:22:07

భారత్‌ పట్ల ప్రపంచదేశాల సానుకూలత

భారత్‌ పట్ల ప్రపంచదేశాల సానుకూలత

  • పీఏఎఫ్‌ఐ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్‌పట్ల ప్రపంచదేశాలు అత్యంత సానుకూల దృక్పథంతో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. కరోనా కట్టడిలో భారత్‌ ప్రపంచదేశాలకు ఒక బలమైన సందేశం ఇచ్చిందన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌నుంచి పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండి యా (పీఏఎఫ్‌ఐ) సభ్యులతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దేశంలోని అనేక కార్పొరేట్‌ సంస్థల సీనియర్‌ ప్రతినిధులతోపాటు పబ్లిక్‌ పాలసీ రంగంలోని ప్రముఖులు 70 మంది మంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కేటీఆర్‌ వారికి వివరించారు. కరోనా సంక్షోభంలోనూ కొత్త అవకాశాలున్నాయని భావిస్తున్నామని, ముఖ్యంగా దేశ పారిశ్రామికరంగం ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తాము ఇప్పటివరకు హాజరైన సమావేశాల్లో కేటీఆర్‌తో జరిగిన భేటీ అత్యున్నతమైనదని పీఏఎఫ్‌ఐ మంత్రిని ప్రశంసించింది. సంక్షోభ సమయంలోనూ అద్భుతమైన ఆలోచనలతో ముందుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారని పీఏఎఫ్‌ఐ ప్రతినిధులు అభినందించారు. పబ్లిక్‌ అఫైర్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాకు గౌరవ సభ్యులుగా ఉండాలని వారు కేటీఆర్‌ను కోరారు.

నీలోఫర్‌ మాజీ సూపరింటెండెంట్‌ మృతికి కేటీఆర్‌ సంతాపం

నీలోఫర్‌ దవాఖాన మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. సుదర్శన్‌రెడ్డి మరణం తనను షాక్‌కు, తీవ్ర కలతకు గురిచేసిందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. చిన్నవయస్సులో ఆయన తనకు చికిత్స చేశారని గుర్తుచేసుకున్నారు. 


logo