శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 01:58:19

ఎవరికీ ఆందోళన వద్దు

ఎవరికీ ఆందోళన వద్దు

  • అందుబాటులో వైద్యం 
  • ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ 
  • పలువురి విజ్ఞప్తులపై స్పందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలకు అత్యవసర సమస్యలు వస్తే సహాయంచేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఏ సమయంలోనైనా ప్రజలకు వైద్యసహాయం అందుబాటులో ఉంటుందని బుధవారం ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. పలువురు బాధితుల సమస్యల పరిష్కారానికి మార్గంచూపారు. సంబంధిత అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. తమ తండ్రికి డయాలసిస్‌ చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కుగానీ, సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ దవాఖానకు గానీ తీసుకెళ్లాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 100, 108లకు కాల్‌ చేస్తే స్పందించడంలేదని, ప్రైవేట్‌ వాహనాలు కూడా లేవని భువనగిరి చెందిన వ్యక్తి ఆందోళన వ్యక్తంచేయడంతో తమ కార్యాలయం సహాయం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

తన భార్య నిండు గర్భిణి అని.. ప్రసవం తేదీ సమీపించినప్పటికీ ఏప్రిల్‌ 14 వరకు డెలివరీలు చేయబోమని, వైద్యులు అందుబాటులో లేరని బోయిన్‌పల్లి లైఫ్‌స్ప్రింగ్‌ దవాఖానలో చెప్తున్నారని యశ్వంత్‌ అనే వ్యక్తి పేర్కొనగా.. దవాఖాన నిర్వాహకులతో తమ సిబ్బంది మాట్లాడి ప్రసవానికి ఏర్పాట్లుచేస్తారని మంత్రి తెలిపారు. ‘మీ భార్య క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకుంటామ’ని ట్వీట్‌చేశారు. హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన సోదరిని కాపాడాలంటూ కోరిన మన్నన్‌ఖాన్‌ అనే వ్యక్తికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పనిమీద హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లిన తాను లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడే చిక్కుకున్నానని, సహాయం కావాలని శ్రేయ అనే మహిళ ట్విట్టర్‌ ద్వారా కోరగా, హిమాచల్‌ప్రదేశ్‌లోనే సహాయంచేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.


logo