బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 05, 2020 , 01:06:03

సిటిజెన్‌ హీరో.. అంగన్‌వాడీ టీచర్‌

సిటిజెన్‌ హీరో.. అంగన్‌వాడీ టీచర్‌

  • స్కూటీపై వెళ్లి బాలింతలకు సరుకులు పంపిణీ 
  • అభినందించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి పలువురు చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా బాలింతలకు అందించే వస్తువులను తన స్కూటీపై తీసుకెళ్లి వారికి పంపిణీ చేస్తున్న ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామ టీచర్‌ రమణను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించారు. ములుగు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో బాలింతలకు అంగన్‌వాడీ వస్తువులను ఇస్తూ ఉద్యోగంలో చిత్తశుద్ధి చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్‌ యోగితారాణాలకు 5 వేల ఫేస్‌ మాస్కులను అందజేసిన పద్మశ్రీ గ్రహీత సునీతా క్రిష్ణన్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

చిన్నారి వైద్యానికి తక్షణ సాయం

చిన్నారి వైద్యానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఒక తండ్రి చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. నాలుగేండ్ల కూతురు క్యాన్సర్‌తో బాధపడుతున్నదని, పది రోజులుగా మహబూబ్‌నగర్‌లో చిక్కుకుపోయామని మహ్మ ద్‌ షకీల్‌ మోహిద్దీన్‌ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తిచేశారు. చికిత్స కోసం హైదరాబాద్‌ రావడానికి రవాణా సౌకర్యంలేదని ఆవేదన వ్య క్తంచేశారు. కేటీఆర్‌ సూచనతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వారికి కావాల్సిన సాయం అందించారు.

వ్యాక్సిన్‌ పరీక్షలపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ 

కరోనా నివారణకు వ్యాక్సిన్‌ తయారీ కోసం పరీక్షలు చేస్తున్న భారత్‌ బయోటెక్‌ కృషిని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో అభినందించారు. ‘కరోనా నివారణ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీకి నా శుభాకాంక్షలు. ఈ పనిలో కంపెనీ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, వారి బృందానికి విజయం చేకూరాలి’అని ఆకాంక్షించారు. 


logo