మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 10:33:23

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌ : నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వరద పరిస్థితి, తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఉదయమే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు, హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లలతో కలిసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులంతా ఈ క్షేత్రంలోనే  అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సమీపంలోని ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని చెప్పారు. సహాయ కేంద్రాల్లో అన్నివసతులు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయంతోపాటు అన్నిసౌకర్యాలు కల్పించాలన్నారు. సహాయ శిబిరాల్లోని వారికి బస్తీ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్లతోపాటు వైద్య సిబ్బంది సేవలందించాలని కోరారు. విరిగిపడిన విద్యుత్ స్తంభాలను సరిచేసి సరఫరాను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తినందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్ నాలాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ సిబ్బందితో సమన్వయం పని చేయాలని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo