బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 16, 2020 , 02:41:04

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

  • కొవిడ్‌-19 నివారణకు ఒక ఫార్ములా అంటూ లేదు
  • వ్యాధి సోకకుండా చూసుకోవడమే ఉత్తమమార్గం
  • త్వరలోనే కరోనారహిత రాష్ట్రంగా తెలంగాణ
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్‌ 

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ వేములవాడ, నమస్తేతెలంగాణ : కనిపించని శత్రువుతో ప్రపంచదేశాలు యుద్ధం చేస్తున్నాయని, మానవజాతి ఇతిహాసంలో ఇలాంటి దృశ్యాలు చూస్తామని ఎవరూ ఊహించలేదని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. కరోనా దాడిని అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికానే తట్టుకోలేకపోతున్నదని అంటూ.. వైరస్‌ నియంత్రణలో మనదేశ ప్రజల ఐక్యతను చూసి ప్రపంచదేశాలు హర్షిస్తున్నాయని చెప్పారు. వైరస్‌కు వ్యాక్సిన్‌లేదని, నియంత్రణ ఒక్కటే మార్గం అని తెలిపారు. ఈ విపత్కర సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. 

మే నెల 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిందని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. త్వరలోనే తెలంగాణను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. మంత్రి కేటీఆర్‌ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. తొలుత ఆయన ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి వేములవాడ పట్టణానికి చేరుకుని సుభాష్‌నగర్‌లోని కంటైన్మెంట్‌ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరోనాకు ఒక ఫార్ములా అంటూ లేదని, అది సోకకుండా చూసుకోవడమే మేలని చెప్పారు. కరోనా నియంత్రణలో రాబోయే రెండువారాలు అత్యంత కీలకమని, లాక్‌డౌన్‌ నియమాలను పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కేటీఆర్‌ విజ్ఞప్తిచేశారు. అభివృద్ధి చెందిన దేశాలైన స్పెయిన్‌, ఇటలీ, అమెరికాలలో వ్యాధి కంట్రోల్‌ కావడంలేదని, లాక్‌డౌన్‌ వల్లనే మనదేశంలో కట్టడిలో ఉన్నదని చెప్పారు. మర్కజ్‌ ఘటన కారణంగానే కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు పోతున్నదని చెప్పారు. ఒకటి ఆరోగ్యపరంగా భద్రతాచర్యలు తీసుకోవడం, రెండోది లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తూ.. ప్రజలను స్వీయనిర్బంధంలో ఉంచడం, మూడోది అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడం అని వివరించారు.

ప్రతి గింజనూ కొంటాం

రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. గత వానకాలంలో సిరిసిల్ల జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, కాళేశ్వరం జలాల రాకతో యాసంగిలో దిగుబడి 3.60 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 212 కేంద్రాలు ఏర్పాటుచేసి, 139 ప్రారంభించినట్లు చెప్పారు. మూడు మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, కమిషనర్‌ సమ్మయ్య, సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు పాల్గొన్నారు. 

స్వీయ నియంత్రణ పాటించాలి

ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వాలకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని కోటి నాలుగు లక్షల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ రూ.1500 చొప్పున రూ.1300 కోట్లు వారి ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. రేషన్‌కార్డున్న ప్రతి ఒక్కరికి రూ.1100 కోట్ల ఖర్చుతో 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించామని చెప్పారు. కరోనా నివారణకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన కలెక్టర్‌, ఎస్పీ, వైద్యులు, మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బందిని కేటీఆర్‌ అభినందించారు. సిరిసిల్లలో కరోనా నియంత్రణ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే జిల్లాలో కరోనా కేసును ఒక్కటికే పరిమితం చేయవచ్చన్నారు. 


logo