బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 02:20:03

ఫార్మారంగానికి ఊతమివ్వాలి

ఫార్మారంగానికి ఊతమివ్వాలి

 • ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలి 
 • ఐటీ, జీఎస్టీ రిఫండ్‌ వెంటనే చెల్లించాలి
 • ఎగుమతి ప్రోత్సాహకాలు పెంచాలి
 • ఔషధ రంగంలో సంస్కరణలు అవసరం
 • కేంద్రానికి మంత్రి కే తారకరామారావు  లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఫార్మా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఆ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఫార్మారంగంలో 80శాతం వరకు చిన్న, మధ్య తరహా కంపెనీలున్నందున వాటిని ఆదుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. సంస్కరణలు చేపట్టడంద్వారా భారత ఫార్మారంగాన్ని ప్రపంచంలోనే నాయకత్వ స్థానానికి తీసుకెళ్లవచ్చని మంత్రి సూచించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి వీ సదానందగౌడకు బుధవారం ఒక లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఔషధ పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిందని, కార్మికుల కొరత ఏర్పడిందని, ఇంకా ఆ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ఆ పరిశ్రమలపై ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నదని, ఫలితంగా పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి లేదని, ముడిసరుకులు, ఇతర ఖర్చులు పెరుగడం వలన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉత్పత్తి కొనసాగించడం కంపెనీలకు భారంగా మారిందని, అందువల్ల అత్యవసరం కాని ఔషధాల రేట్ల నిర్ధారణలో కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు. 

దీర్ఘకాలిక చర్యలు అవసరం

భారత ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు దీర్ఘకాలిక చర్యలు అవసరమని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఫార్మా రంగానికి అవసరమైన ముడిసరుకులు ఏపీఐలకు సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తామంటున్న మూడు బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కులను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. చైనాతో పోలిస్తే భారత్‌లో 30 నుంచి 40శాతం ఉత్పాదన ఖర్చు ఎక్కువగా ఉన్నదని, దీనిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా క్లస్టర్‌..‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ’ని ఏర్పాటు చేస్తున్నదని, జాతీయ ప్రాధాన్యం ఉన్న దీనికి ఇప్పటికే నిమ్జ్‌ హోదా వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులో భారత్‌కు పెట్టుబడులతో వచ్చే కంపెనీలు హైదరాబాద్‌ వైపు దృష్టి పెట్టేలా కేంద్రం సహకరించాలని కోరారు. ఫార్మాసిటీకి పూర్తిమద్దతును అందజేయాలని విజ్ఞప్తిచేశారు. 

విధానాలు మార్చాలి

భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు ప్రస్తుతమున్న విధానాల ప్రక్రియను సమూలంగా మార్చివేసి నూతన ఫార్మాస్యూటికల్‌ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి సూచించారు. ఎగుమతులు పెంచేందుకు ప్రత్యేక ‘ఫార్మా ఎక్స్‌పోర్ట్‌ పథకాన్ని’ ప్రవేశపెట్టాలని తెలిపారు. ఫార్మారంగంలో ఎంఎస్‌ఎంఈల పాత్ర కీలకమైందని, వాటికి అర్హత రూ.10 కోట్లుగా ఉన్నదని, దీనిని రూ.250 కోట్లుగా మార్చాలని కోరారు. అలాగే ఎంఎస్‌ఎంఈలకు ప్రభు త్వం ఇవ్వాల్సిన పలు మినహాయింపులు, ప్రోత్సాహకాలను కూడా కేటీఆర్‌ సూచించారు. వర్ధమాన దేశాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉంటుందన్న ప్రచారం వల్ల భారత పరిశ్రమలు కొన్ని అవకాశాలను కోల్పోతున్నాయని, దీన్ని అధిగమించేందుకు లక్షిత దేశాలతో ద్వైపాక్షికచర్చలు జరుపాలని, ప్రస్తుతం వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఫార్మారంగం ఉత్పాదన ప్రమాణాలను పెంచేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. ఫార్మా అనుమతులకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని కేటీఆర్‌ కోరారు.

భారతదేశపు ఫార్మాస్యూటికల్‌ హబ్‌గా తెలంగాణ కొనసాగుతున్నదని, సుమారు 800 లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు తమ రాష్ట్రంలో ఉన్నాయని కేటీఆర్‌ తెలిపారు. జాతీయ ఉత్పత్తిలో 35 శాతం కంటే అధికంగా తెలంగాణనే అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ రంగంలో సుమారు లక్షా ఇరవై వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యం గల ఫార్మా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలో అవసరమైన మేరకు కృషి చేస్తున్నదన్నారు. 

మమ్మల్ని తెలంగాణకు తీసుకెళ్లండి

 • మంత్రి కేటీఆర్‌కు పలువురి విజ్ఞప్తి


లాక్‌డౌన్‌కు ముందు దేశంలోని వివిధ రాష్ర్టాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయినవారు తమను తెలంగాణకు తీసుకెళ్లాలంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును విజ్ఞప్తిచేస్తున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన దాదాపు 31 మంది మార్చి 15న ముంబై వెళ్లారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రారంభంకావడంతో వారు అక్కడే ఉండిపోయారు. దీంతో తాము మెదక్‌కు వచ్చేలా చూడాలని పలువురు ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ను కోరారు. మరోవైపు యూపీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో దాదాపు 300 మందిమి ఢిల్లీలో ఉన్నామని, తమను తెలంగాణకు తీసుకెళ్లాలని విద్యార్థులు కేటీఆర్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో స్పందించిన మంత్రి వీరిని స్వరాష్ర్టానికి తీసుకురావడానికి ఏర్పాట్లుచేయాలని డీజీపీకి, ఢిల్లీలోని రెసిడెంట్‌ కమిషనర్‌కు సూచించారు.

ఫార్మా పరిశ్రమలను ఆదుకొనేందుకు  మంత్రి కేటీఆర్‌ చేసిన సూచనలు

 • చిన్న, మధ్య తరహా ఔషధ పరిశ్రమలకు ఆదాయం పన్ను, జీఎస్టీ రిఫండ్‌లను వెంటనే చెల్లించాలి. ఆరునెలలపాటు పన్ను వసూళ్లపై మారటోరియం విధించాలి. 
 • కేంద్రం పరిధిలోని ఎగుమతుల ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రాతిపదికను అతి తక్కువ ప్రక్రియతో పూర్తిచేసేందుకు నిబంధనలు సరళతరం చేయాలి. పెండింగ్‌ ప్రోత్సాహకాలన్నింటినీ వెంటనే విడుదలచేయాలి.
 • చైనా వంటి దేశాల పోటీని ఎదుర్కొనేందుకు సాధ్యమైనంత ఎక్కువగా ఎగుమతి ప్రోత్సాహకాలివ్వాలి.
 • రిజర్వుబ్యాంకు పలుమార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఫార్మా కంపెనీలకు రుణాలు ఇచ్చేలా వాణిజ్య బ్యాంకులను ఆదేశించాలి. 
 • అత్యవసరంకాని మందుల రేట్లను పది శాతం వరకు పెంచుకునే అంశంపై ఉదారంగా వ్యవహరించాలి.
 • ముడిసరుకుల దిగుమతిలో నౌకాశ్రయాల వద్ద విపరీతమైన ఆల స్యం జరుగుతున్నది, దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. 
 • నౌకాశ్రయాల వద్ద అయ్యే ఖర్చును కనీసం ఆరునెలలపాటు ఫార్మా కంపెనీల నుంచి వసూలు చేయవద్దు.
 • ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఫార్మారంగంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మరింత పెంచేందుకు ఆ రంగంలోని నిపుణులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలి.


logo