గౌడలను గౌరవించాం

- జీహెచ్ఎంసీలో 18 సీట్లు కేటాయించాం
- వెనుకబడినవర్గాలకు యాభైశాతానికిపైగా టికెట్లు
- ‘గ్రేటర్ హైదరాబాద్ గౌడ ఆత్మీయ సమ్మేళనం’లో మంత్రి కేటీఆర్
- కల్లును నిషేధించి గౌడలను మోసంచేసిన గత ప్రభుత్వాలు: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కులవృత్తుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తున్నారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గౌడల ఆర్థిక పురోభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. గురువారం గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన ‘గ్రేటర్ హైదరాబాద్ గౌడ ఆత్మీయ సమ్మేళనం’లో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడకులానికి పలు సంక్షేమ పథకాలతోపాటు, వారి ఆర్థిక పురోగతికి సీఎం కేసీఆర్ పలు ప్రయోజనాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ పురోభివృద్ధికి బాటలు వేసుకుంటున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజల వెంటే ఉంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గౌడ కులస్తులు 18మందికి టికెట్లు ఇచ్చి గౌరవించుకున్నామని చెప్పారు. వారితోపాటు, ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించుకుందామని.. నగరాభివృద్ధికి మరింతగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ‘సల్లకొచ్చి ముంత దాచే అలవాటు నాకు లేదు. మీ ఆశీర్వాదం కోసమే మీ ముందుకొచ్చిన. టీఆర్ఎస్ను గెలిపించండి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను కొందరు ఢిల్లీ ఎన్నికలుగా మార్చారని.. గల్లీలో ఎన్నికల కోసం కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చివరకు ప్రధానమంత్రి కూడా వస్తున్నారట అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కరెంట్ ఉండేది కాదని, ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. నగర శివారులో ఇప్పటికే మంచినీటి వసతి కల్పించుకున్నామని, హైదరాబాద్ జనాభా ఎంత పెరిగినా 2050 వరకు తాగునీటికి సమస్య రాకుండా కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించుకున్నామని, చెత్తను సేకరించి నగరాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నమని వివరించారు. ఇప్పటివరకు ఇన్నిచేశాం.. మరోసారి ఇంకెన్ని చేస్తామో ఆలోచించాలని సూచించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు పిచ్చోళ్లు తయారయ్యారని, వారు విద్వేషాలు సృష్టించడం తప్ప.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏమి చేస్తారో చెప్పడం లేదని మండిపడ్డారు.
కులవృత్తులకు చేయూతనిచ్చిన కేసీఆర్: శ్రీనివాస్‌గౌడ్
కులవృత్తులకు చేయూతనిచ్చిన బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాటిచెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలను గత ప్రభుత్వాలు ఆదుకోకపోగా.. కల్లు-నీరాలను విషపానీయాలుగా చిత్రించి నిషేధించారని మండిపడ్డారు. అణగారిన గౌడ కులస్తులకు అప్పట్లో ఏ ప్రభుత్వాలూ సాయం చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక, కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి కల్లు దుకాణాలను తెరిపించారని చెప్పారు. గౌడలు ఆత్మగౌరవంతో బతికేలా చేశారని అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే నీరా పాలసీని తీసుకువచ్చారని గుర్తుచేశారు. గౌడలు మాత్రమే దీనిని అమ్మాలి అంటూ జీవోను సైతం తీసుకొచ్చారని కొనియాడారు. అన్ని కులాల భవనాల కోసం రూ.5,000 కోట్ల భూముల్ని ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బీసీలకు 57 శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. సర్దార్ పాపన్న వారసులుగా అన్ని కులాలను కలుపుకుపోతూ ముందుకెళ్లాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకొని పొరుగు పార్టీలకు ఎక్కడ వాత పెట్టాలో.. అక్కడే పెట్టాలని గౌడ కుల సభ్యులను ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బల్దియా ఎన్నికల్లోని 150 డివిజన్లలో 75 సీట్లు అణగారినవర్గాలకు కేటాయించి కేసీఆర్ సామాజిక న్యాయం చేశారని చెప్పారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్, గౌడ సంఘం నేతలు బాలగోని బాలరాజుగౌడ్, కూన వెంకటేశ్‌గౌడ్, గౌడ జనహిత పోరాట సమితి అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్, గౌడ ఐక్యసాధనసమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, అయిలి వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాటిచెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలను గత ప్రభుత్వాలు ఆదుకోకపోగా.. కల్లు-నీరాలను విషపానీయాలుగా చిత్రించి నిషేధించాయి. తెలంగాణ ఏర్పడ్డాక, కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి కల్లు దుకాణాలను తెరిపించారు. గౌడలు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు.
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గౌడల ఆర్థిక పురోభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గౌడకులానికి పలు సంక్షేమ పథకాలతోపాటు, వారి ఆర్థిక పురోగతికి సీఎం కేసీఆర్ పలు ప్రయోజనాత్మక చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గౌడ కులస్తులు 18మందికి టికెట్లు ఇచ్చి గౌరవించుకున్నాం.
‘ఓతో జుమ్లా థా..’
ఢిల్లీలో ఓ విలేకరి ‘ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేశారా?’ అని కేంద్రమంత్రి అమిత్‌షాను అడిగితే ఆయన ‘ఓతో జుమ్లాథా..’ అన్నడట. ఆయింత జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక మన కిషనన్నను అడిగితే ఆయన కూడా ‘ఓతో జుమ్లాథా.. జనం చెవుల పువ్వు పెట్టినం’ అంటడేమో జాగ్రత్త.
ఊదు కాలదు.. పీరు లేవదు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు తయారుగా ఉన్నయ్. మా అక్క చెల్లెళ్లకు వాటిని ఇచ్చే జిమ్మేదారి మాది. ఇంక మూడేండ్లు మన ప్రభుత్వమే ఉంటది. ఇండ్లు ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులతోటి ఊదు కాలదు.. పీరు లేవదు.
- మంత్రి కేటీఆర్
తాజావార్తలు
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు