బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:40

డంపింగ్‌ యార్డుల్లో పవర్‌ ప్లాంట్లు

డంపింగ్‌ యార్డుల్లో పవర్‌ ప్లాంట్లు

  • చెత్త నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి
  • చెత్త నుంచి 63 మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తి 
  • జవహర్‌నగర్‌లో రూ.250 కోట్లతో లిచడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు
  • రూ.147 కోట్లతో గ్రీన్‌ క్యాపింగ్‌ 
  • జవహర్‌నగర్‌ పేదలకు రూ.1కే నల్లా కనెక్షన్‌
  • వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కే తారకరామారావు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పవర్‌ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసుకోవడం ఆనందంగా ఉన్నది. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను కొత్తగా ఏర్పాటుచేయనున్న డంపింగ్‌ యార్డులకు తరలించి వికేంద్రీకరిస్తాం. 

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్న చెత్తకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకొంటున్నామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ లో చెత్త నుంచి ప్రతిరోజూ సుమారు 19.08 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న పవర్‌ప్లాంట్‌ను  మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో 18-20 నెలల్లో 20.02 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న మరో ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పవర్‌ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసుకోవడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను కొత్తగా ఏర్పాటుచేయనున్న డంపింగ్‌ యార్డులకు తరలించి చెత్తను వికేంద్రీకరిస్తామన్నారు. సంగారెడ్డిలోని లక్డారం, మెదక్‌ జిల్లాలోని ప్యారేనగర్‌లో కొత్తగా డంపింగ్‌యార్డులను ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు. 

ఈ డంపింగ్‌యార్డుల్లో కూడా పవర్‌ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఇందుకోసం స్థలాన్ని గుర్తించి జీహెచ్‌ఎంసీకి అప్పగించామని వివరించారు. దుండిగల్‌లో కూడా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు వద్ద రూ.250 కోట్లతో లిచడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇందుకోసం అవసరమైన నిధులను ఇప్పటికే విడుదలచేశామని, పరిపాలనా అనుమతులను కూడా జారీచేశామన్నారు. నగరంలో ఉత్పత్తి అయిన చెత్త నుంచి 63 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్లను సమీప భవిష్యత్తులో ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. జవహర్‌నగర్‌ ప్రాంత ప్రజలకు దుర్వాసన నుంచి విముక్తి కల్పించేందుకు రూ.147 కోట్లతో చెత్తకుప్పలపై గ్రీన్‌ క్యాపింగ్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు.


పేదలకు భూయాజమాన్య హక్కులు 

రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొన్న ప్రతి పేద కుటుంబానికి భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ మరోసారి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 2.77 కోట్ల ఎకరాల భూమి ఉండగా, ఇందులో 1.55 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు వంటి పథకాల వల్ల ఈ విషయం మనకు స్పష్టమైందని చెప్పారు. ఇందులో మిగిలిన 1.22 కోట్ల ఎకరాలలో 66 లక్షల ఎకరాలలో చెరువులు, వాగులు, రైల్వేలైన్లు, నదులు, పరిశ్రమలు, అటవీ భూములు విస్తరించి ఉన్నాయన్నారు. 64 లక్షల  ఎకరాల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, నివాసిత ప్రాంతాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. అయితే జవహర్‌నగర్‌తోపాటు అలాంటి కొన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలకు యాజమాన్య హక్కులు లేవని.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. జవహర్‌నగర్‌ ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తామన్నారు.

డంప్‌యార్డు రూపురేఖలు మార్చుతా

జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు రూపురేఖలు మారుస్తానని రాంకీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌ను దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అయోధ్యరామిరెడ్డిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాంకీ చైర్మన్‌.. ఈ ప్రాంతంలో ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధిచేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలోనూ తనవంతు సహకారమందిస్తానని వెల్లడించారు. ఈ ప్రాంత పాఠశాలలు, దవాఖానలకు సంబంధించిన వివరాలు రాంకీ చైర్మన్‌కు అందించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ మంగమ్మను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జవహర్‌నగర్‌ మేయర్‌ మేకల కావ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌, పీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ రఘుమారెడ్డి, టీఎస్‌ జెన్‌కో చైర్మన్‌ జానయ్య, రాంకీ ఎన్విరో సీఈవో గౌతమ్‌రెడ్డి, జవహర్‌నగర్‌ డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ అసెంబ్లీ ఇంచార్జి మహేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్న చెత్తకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకొంటాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పవర్‌ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసుకోవడం ఆనందంగా ఉన్నది. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను కొత్తగా ఏర్పాటుచేయనున్న డంపింగ్‌ యార్డులకు తరలించి చెత్తను వికేంద్రీకరిస్తాం.

- కే తారకరామారావు, పురపాలకశాఖ మంత్రి