సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 01, 2020 , 02:54:26

ప్రపంచంతోనే పోటీ

ప్రపంచంతోనే పోటీ
  • అన్నిరంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం
  • అతిత్వరలో టీఎస్‌ బీపాస్‌.. లంచాలు లేకుండా భవన నిర్మాణ అనుమతులు
  • ద్వితీయశ్రేణి నగరాలపై దృష్టి
  • పదిరోజుల్లో జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మెట్రో
  • క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌
  • ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవం దక్కుతున్నది
  • ప్రతిపక్షాలకు పనిలేకుండా చేశాం
  • ఆరేండ్లలో చిన్న ఘటనలూ చోటుచేసుకోలేదు
  • సీఎం కేసీఆర్‌ నాయకత్వ పటిమకు అదే నిదర్శనం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో రాష్ర్టానికి ప్రపంచంతోనే పోటీ అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉన్నదని గర్వంగా చెప్పుకొంటున్న మనం.. ఎందుకు ప్రపంచంతో పోటీ పడకూడదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి కట్టడాలు నిర్మించాలని, నిర్మాణరంగంసహా అన్ని రంగాల్లో మరింత రాణించేందుకు ప్రపంచంతోనే మనకు పోటీ అని స్పష్టంచేశారు. 


శుక్రవారం ఆయన హైటెక్స్‌లో 9వ ఎడిషన్‌ క్రెడాయ్‌ ప్రాపర్టీషోను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జీవన్‌రెడ్డి, క్రెడాయ్‌ అధ్యక్షుడు పీ రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో కలిసి  ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రియల్‌ఎస్టేట్‌ రంగానికి సంబంధించి డెవలపర్లు పేర్కొన్న అన్ని సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిష్కరించారని చెప్పారు. దీనితో తనకు పెద్దగా పనిలేకుండా పోయిందన్నారు.  కేసీఆర్‌ నాయకత్వంలో ఇటు తమకు, అటు ప్రతిపక్షాలకూ పనిలేకుండా పోయిందని చమత్కరించారు. 


తెలంగాణ రాష్ట్రం గురించి, హైదరాబాద్‌ గురించి దేశం మొత్తం చెప్పుకొంటున్నదని, రాష్ట్రప్రతినిధులుగా ప్రపంచంలో తాము ఎక్కడికివెళ్లినా గొప్ప గౌరవం దక్కుతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని, స్థిరమైన ప్రభుత్వం ఒకటైతే.. కేసీఆర్‌ రూపంలో ఉన్న సమర్థ నాయకత్వం మరొకటని చెప్పారు. ఇవి రెండూ ఉండటం తెలంగాణ రాష్ట్ర అదృష్టమన్నారు. దేశంలో ఎక్కడచూసినా ఏదోఒక ఆందోళన చెలరేగుతున్నదని.. తెలంగాణలో గడిచిన ఆరేండ్లలో ఎలాంటి ఘటనలు జరుగకపోవడం సీఎం కేసీఆర్‌ నాయకత్వ పటిమకు  నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అమెరికాలోని జేఎల్‌ఎల్‌ గ్లోబల్‌సంస్థ, ఆక్స్‌ఫర్డ్‌ ఎకానమీ, యూఎన్‌కు చెందిన మరోసంస్థ కలిసి హైదరాబాద్‌ను ప్రపంచంలోనే మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా ప్రకటించాయని గుర్తుచేశారు. అందులో క్రెడాయ్‌ కృషి కూడా ఉన్నదని,  దీనిని ఇలాగే కొనసాగించాలని చెప్పారు. నిర్మాణరంగంలోని కూలీలు, తాపీమేస్త్రీలు, ఇతరవృత్తులవారికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు వరుసగా ఒకేరోజు ఆరు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చామని గుర్తుచేశారు. 


పదిరోజుల్లో జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో రైలు సేవలను సీఎం  కేసీఆర్‌ వారం పదిరోజుల్లో ప్రారంభించబోతున్నారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దాంతో భారత్‌లోనే రెండో అతిపెద్ద మెట్రోరైలు కలిగిన నగరంగా ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌ నిలువబోతున్నదని వివరించారు. మెట్రో రెండోదశకు సంబంధించి చాలా ప్లానింగ్‌ జరుగుతున్నదని, తద్వారా కొత్త మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. నాగోల్‌ నుంచి మెట్రోను ఫలక్‌నుమా వరకు, ఫలక్‌నుమా నుంచి శంషాబాద్‌ వరకు కలుపాల్సి ఉన్నదని పేర్కొన్నారు. 


అతి త్వరలో టీఎస్‌ బీపాస్‌

టీఎస్‌ ఐపాస్‌ పేరుతో ఐదేండ్లక్రితం విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చామని.. భవన నిర్మాణ అనుమతుల కోసం త్వరలోనే టీఎస్‌ - బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. టీఎస్‌- ఐపాస్‌ మాదిరిగానే టీఎస్‌- బీపాస్‌ కూడా దేశానికి ఆదర్శమవుతుందని చెప్పారు. భవన నిర్మాణ అనుమతులకు లంచం లేకుండా పనిజరిగేలా  చూసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ‘దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఒకటైతే.. క్వాలిటీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మరొకటి. ఇది పెరుగాలి. కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తగ్గాలి’ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు పూర్తయ్యాయని, రాబోయే నాలుగేండ్లు పురపాలన, పరిపాలన పైనే దృష్టిసారిస్తామని చెప్పారు. 

 

జూన్‌లో అతిపెద్ద టీ హబ్‌ ఫేజ్‌-2 ప్రారంభం

వచ్చే జూన్‌, జూలై నెలల్లో టీహబ్‌ ఫేజ్‌-2ను ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రపంచంలోనే నాలుగువేల స్టార్టప్‌లు ఒకేచోట ఉండేలా.. నాలుగు లక్షల చదరపు అడుగుల్లో  దీనిని నిర్మిస్తున్నట్టు వివరించారు. ‘టీ-వర్క్స్‌, ఫార్మాసిటీ వంటివి ఈ ఏడాదిలోనే లాంచ్‌ చేయబోతున్నాం. వీటివల్ల నిర్మాణరంగానికి మరింత ఊతం వస్తుంది. ఈస్ట్‌, నార్త్‌లో ఐటీపార్క్‌లు, సదరన్‌లో ఫార్మాతోపాటు ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్టర్లు వస్తాయి. ఓఆర్‌ఆర్‌ చుట్టూ కొత్త పరిశ్రమలు వస్తాయి. హైదరాబాద్‌ గ్రోత్‌స్టోరీ మొదలైంది. మరో 20 ఏండ్లపాటు ఈ ఊపు కొనసాగుతుంది. కొత్త డెవలపర్లు తప్పుడు సమాచారం నమ్మవద్దు’ అని పేర్కొన్నారు. 


ద్వితీయశ్రేణి నగరాలపై దృష్టి

హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని.. వరంగల్‌కు టెక్‌మహీంద్రా, సైయెంట్‌ కంపెనీలొచ్చాయని, ఇప్పటికే వెయ్యిమందికి ఉపాధి కల్పిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రూరల్‌ టెక్నాలజీ పాలసీ వల్ల జనగామ, హుజూరాబాద్‌, కామారెడ్డి వంటి చిన్న పట్టణాల్లో కూడా బీపీవోలు వస్తున్నాయని వివరించారు. ‘రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపైనా దృష్టిసారించాలి. హైదరాబాద్‌పై మాత్రమే  దృష్టిపెట్టకుండా కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ, ఖమ్మం వంటి పట్టణాలకు వెళ్లాలి. అక్కడా మంచి అవకాశాలున్నాయి. ఈ తీరును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కార్పొరేషన్లకు నేరుగా నిధులిస్తున్నాం. మున్సిపాలిటీల్లో టీయూఎఫ్‌ఐడీసీ సంస్థ ద్వారా రూ.2,500 కోట్లతో మౌలిక వసతులు సృష్టిస్తున్నాం. నిర్మాణసంస్థలకు మంచి అవకాశాలున్నాయి. క్రెడాయ్‌ యూత్‌ రాష్ట్రమంతటా పర్యటించాలి. ఇతర నగరాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని పెట్టుబడులుపెట్టాలి’ అని విజ్ఞప్తిచేశారు. 


శరవేగంగా ఎస్సార్డీపీ

కొత్త మౌలిక వసతుల కోసం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ)లో భాగంగా రూ.ఆరువేల కోట్లతో పనులు ప్రారంభించగా.. అందులో రూ.నాలుగువేల కోట్ల పనులు పూర్తయ్యాయని, మిగతావి ఏడాదిలో చాలావరకు పూర్తవుతాయని, వాటిలో దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి ఒకటని మంత్రి కేటీఆర్‌ వివరించారు.  ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే నగరంలో బెంగళూరు తొలిస్థానంలో ఉన్నట్టు ఇటీవల ఒక సర్వే వెల్లడించిందని, హైదరాబాద్‌ పేరు ఆ లిస్టులో ఉండకూడదని, అందుకే ఎస్సార్డీపీని శరవేగంగా పూర్తిచేస్తున్నామని పేర్కొన్నారు. 


రాజధానిలో నలువైపులా వృద్ధి 

కేవలం పశ్చిమ హైదరాబాద్‌ మాత్రమే కాకుండా నగరం నలువైపులా వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కేటీఆర్‌ స్పష్టంచేశారు. ‘ఉప్పల్‌-నాగోల్‌ ప్రాంతంలో మూడు ప్రధాన సంస్థలు దాదాపు 20 లక్షల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్‌స్పేస్‌ కట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిని తప్పకుండా మంజూరుచేసి, కంపెనీలు ఆ ప్రాంతానికి వచ్చేలాచేస్తాం. అక్కడ పెట్టుబడిపెడితే.. కాస్ట్‌ తగ్గుతుందనే వాతావరణం కల్పించాలి. అప్పుడే గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌ను వదిలి పెట్టుబడులు పెట్టేందుకు కదులుతారు. పశ్చిమ హైదాబాద్‌లో పనిచేసే చాలామంది ఉద్యోగులు ఎల్బీనగర్‌, ఉప్పల్‌, నాగోల్‌ వంటి దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోనే ఐటీ కంపెనీలు ఏర్పాటుచేస్తే క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ పెరుగుతుంద’ని వివరించారు. 


logo