గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:53

కేంద్రం సహాయ నిరాకరణ

కేంద్రం సహాయ నిరాకరణ

  • రాష్ట్ర ప్రతిపాదనలకు స్పందన కరువు
  • కంటోన్మెంట్‌ రోడ్లపై ఏండ్లుగా లేఖలు
  • హైదరాబాద్‌ విశ్వనగరమే మా లక్ష్యం
  • శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేంద్రం సహకరించడం లేదని, పలు అంశాలపై తాము చేసిన ప్రతిపాదనలకు స్పందన కరువైందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రక్షణరంగానికి చెందిన కంటోన్మెంట్‌ స్థలాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సూచిస్తూ.. సదరు స్థలాలను రాష్ర్టానికి ఇవ్వాలని కొనేండ్లుగా అడుగుతున్నా దానిపై ఆలోచన కూడా చేయడంలేదని విమర్శించారు. ఈ అంశంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు పలుసార్లు లేఖలు రాసినా, స్వయంగా కలిసి ప్రతిపాదించినా ప్రతిస్పందన లేదన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్ల విషయంపై సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నవీన్‌కుమార్‌, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌, రాంచందర్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రం పనిచేయాలనుకుంటే కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు. విభజన రాజకీయాలు కాకుండా రాష్ట్ర ప్రగతికోసం బీజేపీ ప్రజాప్రతినిధులు ఏమైనా చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి ప్రయోజనం కలిగించే అనుమతులు తీసుకురావాలని కోరారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నదని, రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలను రూపొందించినందని తెలిపారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి, ని ర్మాణం, నిర్వహణ వంటి వాటిపై దృష్టిసారించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎస్సార్డీపీ కింద రూ.29,600 కోట్లతో ప్రణాళికలు రూపొందించి.. రూ.6వేల కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. మిస్సింగ్‌ రోడ్లు, లింక్‌ రోడ్లు 137 ఎంపికచేసి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, రెగ్యులర్‌గా రోడ్ల మెయింటనెన్స్‌పై దృష్టి పెట్టామని చెప్పారు. ‘దిల్‌కుశానగర్‌ ద్వారా పోయే రోడ్డు పనిని పూర్తిచేస్తాం. ఖైత్లాపూర్‌ రోడ్‌కు సంబంధించి ఇంకా కొంత పని ఉంది. రైల్వేశాఖ పని పూర్తిచేయక పోవడం వల్లే ఆర్‌యూబీ నిర్మాణాలు జరుగలేదు. హైటెక్‌ సిటీ, కొండాపూర్‌ పరిధిలోని నిర్మాణాలు కూడా ముందుకుసాగలేదు. ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ పనులు రెండు నెలల్లో పూర్తిచేస్తాం’ అని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.


logo