శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 18:54:33

'ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలితీసుకుంటారా?'

'ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలితీసుకుంటారా?'

హైదరాబాద్: ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలితీసుకుంటారా? అని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా?  అని కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్‌  ట్విటర్లో స్పందించారు. 

'హైదరాబాద్‌ ప్రజలపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు చేస్తారు?  దమ్ముంటే దేశంలో నిరుద్యోగం, పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయండి.  హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో ఉందా? చైనాలో ఉందా?   హైదరాబాద్‌పై‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా?   బండి సంజయ్‌ ఏం మాట్లాడుతున్నారు?  సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడానికి హైదరాబాద్‌ దేశ సరిహద్దుల్లో లేదు. శతృదేశంలో అంతకన్నా లేదని' కేటీఆర్‌ అన్నారు. 

'మీకు దమ్ము,  ధైర్యం ఉంటే.. విజన్ అనే పదానికి మీకు విలువ తెలిసి ఉంటే.. దేశంలోని పేదరికంపై  సర్జికల్ స్ట్రైక్‌ చేయండి.  వెనకబాటుతనంపై చేయండి స్ట్రైక్‌. మత విద్వేషాలపై చేయండి సర్జికల్ స్ట్రైక్‌.  ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న.. వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయండి.  తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన వాళ్లపై చేయండి సర్జికల్   స్ట్రైక్. నిరుద్యోగ సమస్యపై చేయండి సర్జికల్ స్ట్రైక్. పరుగులు పెడుతున్న దేశాన్ని అడ్డంగా పడుకోబెట్టిన వాళ్లపై చేయండి సర్జికల్ స్ట్రైక్. ఇవన్నీ మీకు చేతకావనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. అందుకే.. మీ అసమర్థత పాలనపై దేశ ప్రజలు సర్జికల్ స్ట్రైక్ చేస్తారని' కేటీఆర్‌ వరుస ట్వీట్లలో బీజేపీపై విమర్శలు చేశారు.