గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 02:02:29

తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటుతాం

తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటుతాం

  • టీఎస్‌ఐపాస్‌తో విశ్వ ప్రమాణాలు 
  • రాష్ర్టాలవారీగా ఈవోడీబీ ర్యాంకులిస్తే  
  • వరల్డ్‌ టాప్‌ 20లో తెలంగాణ
  • విదేశాల్లోని పారిశ్రామికవర్గాలతో  త్వరలోనే సమావేశాలు 
  • రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం
  • ఈబీజీ ప్రతినిధులతో మంత్రి  కే తారక రామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రపంచ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తమ విధానాల వల్ల పారిశ్రామిక అనుమతులలో అవినీతికి తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతకు అవకాశం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిరమైన విధాన కొనసాగింపు (పాలసీ కంటిన్యుటీ) ఉన్నదని తెలిపారు. గత ఐదేండ్లుగా ఇక్కడి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. గురువారం మంత్రి కేటీఆర్‌  యూరోపియన్‌ బిజినెస్‌ గ్రూప్‌ (ఈబీజీ) ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలుదేశాల రాయబారులు, వివిధ దేశాల్లోని ప్రముఖ కంపెనీల సీనియర్‌ ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ర్టాలను యూనిట్‌గా తీసుకొని  సులభ వాణిజ్య విధానం(ఈవోడీబీ) లో ర్యాంకులిస్తే ప్రపంచంలోనే టాప్‌-20లో తెలంగాణ  ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశాన్ని స్థూలంగా కాకుండా రాష్ర్టాల కోణంలో చూస్తే.. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. భారత్‌లోలో ఈవోడీబీపై వివిధ దేశాలకు ఎలాంటి అభిప్రాయాలున్నా  తెలంగాణ సహా పలురాష్ర్టాలు అత్యుత్తమస్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు. పారిశ్రామికరంగానికి సంబంధించిన అసలైన యాక్షన్‌ రాష్ర్టాల్లోనే ఉన్నదన్నారు. 

టీఎస్‌ఐపాస్‌ సూపర్‌ సక్సెస్‌

టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఈవోడీబీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించామని కేటీఆర్‌ విదేశీ ప్రతినిధులకు తెలిపారు. ఐదేండ్లలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా 13 వేల కంపెనీలకు అనుమతులిచ్చామన్నా రు. భారత్‌లో అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానాల్లో తెలంగాణ ఒకటని వివరించారు. పరిశ్రమల వ్యాపారనిర్వహణకోసం అవసరమైన అనేక చర్యలను ప్రభుత్వం తీసుకొంటున్నదని.. ఇన్నోవేషన్‌ ఈకో సిస్టం కోసం టీ హబ్‌, టీ వర్క్స్‌ వంటి వాటిని ప్రారంభించామని, టాస్క్‌ ద్వారా నైపుణ్య శిక్షణ అభివృద్ధికోసం తెలంగాణ ప్రత్యేక పంథాలో ముందుకుపోతున్నదన్నారు. 

త్వరలో కంపెనీల ప్రతినిధులతో సమావేశం

వివిధ కంపెనీలు ఒకే దేశంలో, ఒకేచోట పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పునరాలోచించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారత్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని కేటీఆర్‌ వ్యక్తంచేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ప్రయత్నిస్తుందన్నారు. ఇందుకోసం ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో రానున్న రోజుల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు సహకరించాలని వివిధ దేశాల రాయబారులను కోరారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఫార్మా , లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌, టెక్స్‌టైల్‌ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని వివిధ పరిశ్రమల ప్రతినిధులను కోరారు.


logo